దురద హోలీ:- వసుధారాణి

 చిన్నప్పటి రోజుల మాట.నేను ఐదవ తరగతి ,మా అక్కయ్య పిల్లలు చిన్నారి,కిషోర్ ఇద్దరూ మూడవ తరగతి చదువుతున్నప్పటి సంగతి.పరీక్షల టైమ్లో చివరాఖరి పరిక్షరోజున  పరీక్ష ఐపోయాక పెద్దక్లాసు పిల్లలు ఇంకు పెన్నుల్లో ఇంకు నంతా చొక్కాలపై చల్లుకోవటం చూస్తే తొందరగా మనంకూడా  పదవ తరగతికి వెళ్ళిపోతే బాగుండు అనిపించేది.కేవలం ఇంకు చల్లుకోవటానికే చదువుకోవటానికి కాదని మనవి.
ఇప్పటిలా ఉత్తరభారత సంసృతి ఇంకా మన దక్షిణ భారతానికి పాకలేదు అప్పటికి. శ్రీరామ నవమి పందిళ్ళలో వసంతం చల్లుకునే వారు.ఐనా అందులో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు పద్దతిగా చల్లుకునే వాళ్ళు .మనకి కిక్కు వచ్చే అంశం కాదు.
ఇలా ఈ ఏదో ఒకటి చల్లుకోవటం అన్న విషయంలో జీవితం కొంచెం డ్రైగా ఉంది అనుకున్నప్పుడు, అనుకోకుండా మా లక్ష్మీ అక్కయ్య వచ్చింది హైద్రాబాద్ నుంచి. అదీ హొలీ పండగ ముందర.వాళ్ళు హైదరాబాద్ కు ముందర నాగపూర్ లో కూడా కొన్నేళ్ళు ఉన్నారు.ఇంకేముంది మా అక్క అక్కడ జరుపుకునే హొలీ విషయాలు అన్నీ ఈస్టమన్ కలర్లో మాకు సినిమా చూపించింది.
ఇక్కడ ప్రజలకి అంతగా పరిచయం లేని హోలిని మేము ఆడాలని ,అందరికీ పరిచయం చెయ్యాలని మేము అనుకున్నాం.
అసలే మేము ముగ్గురం కోతులం ఇంకా కొంతమంది పిల్లల్ని పొగుచేసి SSN కాలేజీ క్రికెట్ గ్రౌండ్ హొలీ  ఆడే స్థలంగా నిర్ణయించుకుని.ఉదయం 7 కల్లా అక్కడికి చేరుకోవాలని మిగిలిన  పిల్లలకి చెప్పేసాము ముందురోజే.
హొలీ ఆడటానికి కావాల్సిన సరంజామా నేనే తీసుకు వస్తానని చెప్పి అందరికీ చెప్పేసాను.నా పిచికారీ సామాన్ల లిస్టు చూద్దామా..సైకిల్ లో ఆయిల్ పోయటానికి వాడే సీసా లో ఇంకు,పొలం లో మందు చల్లాటానికి వాడే డబ్బాలో గులాల్ రంగు కలిపిన నీళ్లు, ఆకుపచ్చ రంగు తేవడం కోసం బొప్పాయి ఆకులు నూరిన రసం గాజు సీసాలో పోసి  దానికి చిల్లులు పెట్టిన మూత.
మాకు మస్తాన్ అనే ఓ పిల్లవాడు శత్రువు కారణాలు అడగద్దు శత్రువు అంటే శత్రువు వాడిని కూడా హోలీకి పిలిచాం బోలెడంత ప్రేమగా.వాడికోసం ప్రత్యేకంగా ఎర్రసీసాలో ఓ పచ్చ రసం.ఇవి మా హొలీ ఏర్పాట్లు.
ఉదయం గ్రౌండ్లో పిల్లలందరం చేరి మొత్తం రంగులన్నీ చల్లుకునే వేళ మస్తాన్ కి ప్రత్యేకంగా తీసుకెళ్లిన సీసా ఆనందంలో మర్చిపోయి అందరం చల్లేసుకున్నాం.ఇంటికి వచ్చి ఒకటే గోక్కోవటం నవ్వుకోవటం.
 ఇంతకీ మస్తాన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆ వసంతంలో దరదగుండాకు రసం నూరి కలిపాను.చేతులకు అంటకుండా మా సావిత్రి అక్కయ్య జువాలజీ ల్యాబ్ లో రబ్బరు గ్లౌస్ తెచ్చుకుని మరీ. ఆవిధంగా మా మొదటి దురదహోలి గడిచింది.