మహాత్మా గాంధీ ఆక్స్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించడానికి వెళ్ళారు. ఆంగ్లేయుల పాలనను తీవ్రంగా ఆయన విమర్శించిన రోజులవి. సమావేశం జరిగిన హాలులోకి గాంధీజీ ప్రవేశించడంతోనే అక్కడున్న వారందరూ లేచి నిల్చుని ఆయనకు సాదర స్వాగతం తెలిపారు.ఇది అనుకోవడానికి మామూలు విషయంగానే అన్పించొచ్చు.కానీ ఇక్కడో విషయం చెప్పుకోవలసి ఉంది.ఎంతటి గొప్పవారైనాసరే ఉన్నతులైనాసరే అక్కడ ఉపన్యసించడానికి వచ్చినప్పుడు ఆ హాలులో ఉన్న వారందరూ కూర్చున్న చోటు నించే తమ టోపీలను తీసి గౌరవపూర్వకంగా స్వాగతించడం సంప్రదాయం. అంతేతప్ప లేచి నిల్చుని గౌరవపూర్వకంగా స్వాగతించే సంప్రదాయం లేదు.కానీ గాంధీజీ విషయంలో అందరూ స్వచ్ఛందంగా నిండు మనస్సుతో లేచి నిల్చుని స్వాగతించడం గమనార్హం.ఈ గౌరవస్వాగతాన్ని గాంధీజీ ఆత్మబలానికి గుర్తింపుగా భావించాలి.కారణమేమిటీ....బ్రిటీష్ వారి పాలనను విమర్శిస్తూ గాంధీజీ పోరాడిన కాలమది. అంతేతప్ప ఆయనకు వ్యక్తిగతంగా ఎవరిపట్లా ద్వేషభావం లేదు.బదులుగా, ఆయన వారిని హృదయపూర్వకంగా ప్రేమించారు. అభిమానించారు. అందుకే బ్రిటీష్ ప్రజలు ఆయనను వ్యతిరేకించలేకపోయారు. ఆయనను ప్రేమించడం తప్ప మరోదారి లేకపోయింది.అందుకే ఆయన సమావేశం ఏర్పాటు చేసిన హాలులోకి అడుగు పెడుతున్నప్పుడు అక్కడున్న వారందరూ లేచి నిల్చుని హృదయపూర్వక స్వాగతం తెలిపారు.ప్రేమే ఆత్మబలం అనేందుకు ఈ సంఘటన ఓ చక్కని ఉదాహరణ.
ఆత్మార్థమైన మర్యాద: -- యామిజాల జగదీశ్