సామెత కథ : ఎం . బిందు మాధవి


 తానెంతో జగమంత" 

షీల కామాక్షమ్మ గారి చిన్న నాటి స్నేహితురాలి కూతురు. 

పెళ్ళయి ఆ ఊరు వచ్చిన షీల, అత్తయ్య గారిని చూసివస్తానని భర్తని తీసుకుని వారింటికి వచ్చింది. 

 చిన్నప్పటి కబుర్లు అవీ చెప్పుకోవటం అయ్యాక, ఆలు బోండా చేసి పెట్టి కాఫీ ఇచ్చి వెళ్ళేటప్పుడు చీర - పసుపు, కుంకుమపెట్టి పంపించింది. 

ఇంటికొచ్చి ఆ కవర్ కప్ బోర్డ్ లో పడేసి, తన పనిలో పడింది. పూర్తిగా ఆ చీర విషయం మర్చిపోయింది. ఒక నెల తరువాతఫ్రెండ్,  తన చెల్లెలికి పెళ్ళి కుదిరిందని పిలవటానికి వచ్చింది. 

ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా అని కప్ బోర్డ్ తలుపు తీసి వెతుకుతూ ఉంటే, కామాక్షమ్మ గారు పెట్టిన చీర ప్యాకెట్కనిపించింది. పెళ్ళి కూతురు కదా పోనీలే చీర పెడితే బాగుంటుంది అని బయటికి తీసింది. తీరా అది సరికొత్త చీర లాగాకనిపించలేదు. మడతలు విప్పి చూస్తే కట్టుకొంగు నలిగి, చేత్తో సాఫ్ చేసినట్లు తెలుస్తోంది. అదేమిటి అత్తయ్య గారు, చూసుకోకుండా పొరపాటున కట్టిన చీర పెట్టారా? లేక కావాలనే ఇంట్లో కొత్తది లేక తను కట్టిన చీర పెట్టారా? అనేసందేహంతో, ఇంకా నయం చూసుకోకుండా పెళ్ళికూతురుకి తీసుకెళ్ళాను కాదు. తప్పుగా అనుకునే వారు అని గిఫ్ట్కొనటానికి బజార్ కి బయలుదేరింది. 

అప్పటికి ఆ పని అయిపోయాక, తల్లికి ఫోన్ చేసినప్పుడు ఈ విషయం చెప్పింది. 'అమ్మా కొంచెంలో తప్పిపోయింది కానీ, చూసుకోకుండా ఆ చీర పెట్టి ఉంటే నా గురించి మా ఫ్రెండ్స్ అంతా ఏమనుకుంటారు ' అన్నది. 

అప్పుడు షీల తల్లి పార్వతి నెమ్మదిగా కామాక్షి గురించి చెబుతూ 'అదంతే,తనకి ఎవరైనా పెట్టిన చీరలు కానీ, తనేకొనుక్కున్నా కానీ  ముందు తను కట్టి, నచ్చకపోతే విప్పి సాఫ్ చేసి మడత పెట్టి ఇంటికొచ్చిన వారికి అతి మర్యాద చేసి, ఎక్కడలేని ఆప్యాయత ఒలకబోసి బొట్టు పెట్టి పెట్టేస్తుంది. అదొక విచిత్రమైన అలవాటు ' అన్నది. 

'అంతే కాదు. "తానెంతో జగమంత" అన్నట్లు, దానికా అలవాటు ఉన్నది కాబట్టి, అందరూ అలాగే చేస్తారుఅనుకుంటుంది. అందుకే మా చిన్నప్పటి నించీ ఎవరైనా పెట్టిన చీరలని మాకు చూపించి, చూశావుటే వాళ్ళు భారసాలకిఅని పిల్చి కట్టిన చీర  పెట్టారు. వాళ్ళకి అది తప్పుగా తోచలేదు. అవతలి వాళ్ళు ఏమైనా అనుకుంటారనైనా ఆలోచించరు. ఏమిటో ఏం మనుషులో అనేది.' 

'అంతటితో ఆగితే ఫరవాలేదు. తన పిల్లలు, తల్లి కదా అని దాన్నే షాప్ కి తీసుకెళ్ళి ఖరీదైన చీరలు కొంటే కూడా అలాగేలెక్క లేకుండా పని వాళ్ళకి, వాకిట్లోకొచ్చే కూరల వాళ్ళకి ఇచ్చేస్తుంది. వీళ్ళేమో గోల ' అని తన ఫ్రెండ్ కి ఉన్న వింత లక్షణాన్నిచెబితే, షీల 'ఇలా కూడా ఉంటారా అమ్మా' అని ముక్కున వేలేసుకుంది.