చెప్పుతో ముఖాముఖీ: -- యామిజాల జగదీశ్

 "మీ జాతి గురించి 
మీరే ఏదైనా చెప్పగలరా?"
"శ్రమించడంకోసమే
పుట్టిన జాతి మాది!
మమ్మల్ని 
డబ్బుపెట్టి కొనుక్కుని 
బానిసలుగా మార్చేది 
మనిషేగా!"
అయినా మాకూ ఆనందం 
లేకపోలేదు
మమ్మల్ని తమ పాదాలతో
అణిచేస్తున్నాసరే
ఆ పాదాలకు 
ముళ్ళు 
మేకులూ గుచ్చుకోకుండా
కాపాడేది మా జాతి!!
"మీ పాదరక్షలను
ఇక్కడ విడవండి" అని
రాసి ఉన్న బోర్డులూ
మాకోసం తయారు చేసే స్టాండులూ
ఎన్ని రకాలో....
అక్కడ మమ్మల్ని 
సవ్యంగా విడిచిపెట్టిపోతే
పొందికగా ఉంటాం....!!
"ఎప్పుడైనా 
బాధ కలుగుతుందా?"
రోడ్లన్నీ శుభ్రంగా తిరిగొచ్చి 
మమ్మల్ని వాకిట్లోనే విడిచిపెట్టి
లోపలికి పోతున్న 
మనిషిని చూసినప్పుడల్లా
మేమెంత సేవ చేసినా 
మాకు వాకిలే దిక్కుగా అని 
బాధపడతాం. 
మేమెంత కష్టపడ్డా
మనిషి జాతికి 
బానిసలమేగా!
మనిషి డబ్బులకు 
ఆమ్ముడుపోయే జాతి మాది!
ఏం చేయగలం?
మా జన్మ ఇంతే...!!
"పాదాలకింద నలిగిపోయే
మిమ్మల్ని విప్పి చేతులతో 
పైకెత్తి శుభ్రం చేసి
పాలిష్ తో మెరుపులు తెప్పిస్తాం కదా.
అది మిమ్మల్ని గౌరవించడమేగా?" 
"నిజమే. ఆ క్షణం గౌరవిస్తారు.
మళ్ళీ పనులకు బయలుదేరారో 
మమ్మల్ని పాదాలకింద తొక్కుతారు!"
"అదలా ఉండనివ్వండి...
పోల్చడానికి వీల్లేని శ్రమకు
మిమ్మల్నేగా మేము ఉదాహరణగా 
చెప్పుకుంటూ ఉంటాం..."
"కావచ్చు. కానీ వొట్టి ఉదాహరణలతో 
మా అవమానాలూ శ్రమలూ మాసిపోవుగా?
అటువంటి ఉదాహరణలతో
మమ్మల్ని తక్కువ చేసేదీ మీరేగా!"
"సరే కానీ....
మీ సమస్యల గురించి 
అందరూ సమావేశమై 
చర్చించుకోవచ్చుగా?"
"ఎటువంటి 
ముందస్తు ప్రకటనా లేకుండా
మా సమావేశాలనూ మీరే 
ఏర్పాటు చేస్తారు.
తీర్మానాలు చేసేస్తున్నారనుకునేలోగా 
మీ బుర్రకే పుడుతుందో కానీ
ఉన్నట్టుండి చెదరిపోతారు! 
మమ్మల్ని బజారుపాలు చేస్తారు.
ఇంకెక్కడ మా తీర్మానాలు ?"
"మీరు చోరీలకు 
గురవుతుంటారా?"
"సిగ్గులేని మనుషుల కళ్ళు 
మామీద పడ్డాయో
మేము చోరీలకు గురవుతుంటాం.
ఎవరి సొంతమో మేము అనేది 
ఆలోచించకుండా
ఆలయ వాకిట్లో
పెళ్ళిమంటపాలలోనూ
జనసమ్మర్దంలోనూ
మమ్మల్ని దోచేస్తారు....
మా యజమాని ఎంత బాధపడతాడో 
అటువంటి సందర్భాలలో.
వారి బాధ చూసి మాకేడుపొస్తుంది!"
"ప్రత్యేకించి 
మీకంటూ ఏదన్నా బాధ?"
"ఉంది.
నేలమీద రాలిన 
పండుటాకులను తొక్కేటప్పుడు 
శబ్దం  చేస్తాం బాధతో.
పువ్వులను తొక్కేటప్పుడు
పెనునిట్టూర్పుతో మౌనం పాటిస్తాం..."
"మిమ్మల్ని కొన్న కొత్తలో
కాళ్ళను కొరికే అలవాటేంటీ మీకు?"
"మాకూ రోషం ఉందని చాటుకోడానికే
మొదట్లో కొంచెం కరుస్తాం.
అయితే అదేపనిగా వేసుకుంటే
మా తోలు దుమ్ముదులిపేసుకుని 
మెత్తబడిపోతాం.... అణగిపోతాం"
"ఉన్నట్లుండి తెగిపోయి
నడివీధిలో
మమ్మల్ని ఇరకాటంలో పడేయడం దేనికి?"
"అది మా సహాయనిరాకరణోద్యమ ప్రారంభఘట్టం!
అయితే మేము ఈ క్రమంలో
వీధి పక్కన కార్మికుల
జీవనానికి ఓ దారి చూపుతాం....
మమ్మల్ని కుట్టి గడించే కూలిపైసలతో
వారి ఆకలి తీరుస్తాం"
"పాతబడిపోయాయి అనే కారణంతో
మిమ్మల్ని మేము పక్కన పడేసేటప్పుడు...?"
"మీరు కొత్తవి కొనుక్కుని
మమ్మల్ని విసిరేసేటప్పుడు  మీరు అంటరానివారిలా చూసేవారికి 
మేము ఉపయోగపడతాం...."
"మీ జీవితంలో
తీయని సంఘటనలు ఏవైనా ....?"
"అందమైన అమ్మాయిలు మమ్మల్ని
వేసుకుని నడుస్తుంటే
మాకెంత ఆనందమో....ఆ పాదాలకు 
ముద్దిస్తాం. హత్తుకుంటాం. ఈ సంఘటన 
మరచిపోలేనిది మా జీవితంలో"
"వేటి గురించైనా 
మీరు తీవ్రస్థాయిలో 
ఆలోచించడమంటూ
ఉంటుందా?"
"ఎందుకుండదూ?!
కొన్ని దేశాలలో
కొంందరి పరిపాలనా తీరును
చూస్తుంటే మమ్మల్ని 
ఎన్నికల గుర్తుగా పెట్టుకునే వారిని
గెలిపించి
అధికారంలోకి రావాలని ఆలోచిస్తాం"