శత్రువుతో ఢీ !: -- పుట్టగుంట సురేష్ కుమార్


 అదో అందాల చిట్టడవి.అందులో బాగా బలిసిన ఓ పొగరుబోతు పొట్టేలు.

     దాన్ని చూస్తే చాలు జంతువులు భయంతో పారిపోతాయి.పొరపాటున ఏ జంతువైనా దానికి చిక్కితే అంతే సంగతులు ! పొట్టేలు దాన్ని తన బలమైన కొమ్ములతో కుమ్మిపడేస్తుంది.

     ఒకరోజు పొట్టేలుకు తమ చిట్టడివిపై తెగ చిరాకేసింది.

    " ఏమిటో ఈ అడవి ! నేను ఢీ అంటే ఢీ అనే జంతువే లేదు.నాకో సమఉజ్జీ కావాలి " అనుకుని ఆ అడవిని విడిచి బయలుదేరింది.

    అలా వెళుతూ వెళుతూ ఓ పెద్ద అడవిని చేరుకుంది.అందులోకి ప్రవేశించి చక్కర్లు కొట్టసాగింది.

    అంతలో ఓ తోడేలు ఎదురైంది.

    పొట్టేలు వణికిపోతూ " బాబోయ్! భయంకర తోడేలుకు చిక్కిపోయా.ఇప్పుడెలా ? " అనుకుంది.

    నడుస్తున్న తోడేలు ఆగి ఎదురుగా ఉన్న పొట్టేలును చూసి ఉలిక్కిపడింది.మరుక్షణం వెనుదిరిగి పరుగు లంకించుకుంది.

    పొట్టేలు గర్వంగా " ఆహా ! నేను తోడేలునే భయపెట్టా ! " అనుకుని హుషారుగా ముందుకు సాగింది.

    ఉన్నట్టుండి చెవులు చిల్లులు పడేలా సింహ గర్జన వినిపించింది.పొట్టేలు తుళ్ళిపడి పరుగులు తీయసాగింది.

    అంతలో దానికి ఎదురుగా సింహం రానే వచ్చింది.అలా వచ్చిన సింహం పొట్టేలును గమనించి , భయంతో కీచుగా గర్జించి అవతలకు పరుగు తీసింది.

    పొట్టేలు వికటాట్టహాసం చేస్తూ " నేను ఏకంగా మృగరాజునే భయపెట్టా ! ఇక ఈ అడవిలో నాకు తిరుగే లేదు " అనుకుని గర్వంగా నడవసాగింది.

    దారిలో ఓ ముసలి కోతి , పొట్టేలును చూసి గబుక్కున దగ్గరలోని నేరేడు చెట్టు పైకి ఎక్కేసింది.

    పొట్టేలు నవ్వుతూ " ఏం కోతి తాతా ! సమఉజ్జీ కోసం మా చిట్టడవి నుంచి మీ పెద్దడవికి వచ్చా.ఇక్కడ నన్ను ఢీ కొట్టగలిగే బలవంతులు ఉన్నారా ? " అని అడిగింది.

    అందుకు ముసలి కోతి " ఎందుకు లేరూ, ఈ అడవిలో ఓ కనిపించని శత్రువు ఉంది.జాగ్రత్త ! " అని హెచ్చరించింది.

    " కనిపించని శత్రువా ? " అని పొట్టేలు చుట్టుపక్కలు పరికించి చూసింది.దూరంగా ఒక మర్రిచెట్టు వద్ద అస్పష్టంగా ఏదో జంతువు కనిపించింది.

    దాని పని పట్టాలని పొట్టేలు శరవేగంతో అక్కడకు వెళితే , చెట్టు కింద నిద్రపోతూ ఒక పెద్దపులి కనిపించింది.పొట్టేలు అదిరిపడి వెనక్కు వచ్చేసింది.

    " కోతి తాతా! శత్రువును చూశా.అదో పెద్దపులి " అంది రొప్పుతూ.

    " అది శత్రువు కాదులే ! పాపం ఆ పెద్దపులి ఈ అడవిలో కనిపించని శత్రువు బారిన పడి అనారోగ్యానికి గురైంది " అంది ముసలి కోతి.

    " అలాగా ! ఇంతకీ ఆ కనిపించని శత్రువు ఎవరు ? " ఆసక్తిగా అడిగింది పొట్టేలు.

    ముసలి కోతి నిట్టూరుస్తూ " దాని పేరు నారోక ! అదో భయంకర అంటు వ్యాధి.ఆ వ్యాధి సోకినవాళ్ళు రోజురోజుకూ బలహీనపడుతూ మృత్యువాత పడతారు " అంది.

    " ఆ నారోకాని మనం ఎదిరించలేమా ? " అడిగింది పొట్టేలు.

    " ఎదిరించగలం ! అందుకో మార్గం ఉంది. అదేమిటంటే , జంతువులన్నీ భౌతిక దూరం పాటించాలి.అప్పుడా వ్యాధి మన దరికి రాదు.విశేషమేమిటంటే ఈ అడవిలోని క్రూర జంతువులు మాంసాహారాన్ని మానేసి సాధు జంతువులుగా మారిపోయాయి.కాయలు,పండ్లు,దుంపలు,ఆకులు తింటూ , భౌతిక దూరం పాటిస్తూ ఆ శత్రువుని ఎదుర్కొంటున్నాయి " వివరించింది ముసలి కోతి.

    అది విన్న పొట్టేలు ఆలోచనలో పడింది.

    ముసలి కోతి నవ్వుతూ " ఏంటి భయమేస్తోందా ? ఇక మీ చిట్టడవికి పారిపోతావా ? " అంది.

    పొట్టేలు అడ్డంగా తలూపుతూ " ఇప్పటి వరకు మా చిట్టడవిలో బలహీన జంతువులపై నా ప్రతాపం చూపించి గొప్పగా భావించేదాన్ని.ఇక్కడకు వచ్చాక తెలిసింది నా ప్రతాపం చూపించవలసింది ఆ కనిపించని శత్రువు నారోకాపై అని.ఇక నేను ఈ అడవిలోనే ఉంటా.మీ అందరితో భౌతిక దూరం పాటిస్తూ ఆ శత్రువును ఢీ కొంటా " అని నిశ్చయంగా చెప్పింది.

    ముసలి కోతి 'శభాష్ ' అంటూ దాన్ని మెచ్చుకుంది.