అతనొక రైతు. అతని దగ్గర ఓ గుర్రం ఉంది. అతనిని వెతుక్కుంటూ ఓ రోజు సాయంత్రం ఓ పొరుగూరు వ్యక్తి వచ్చాడు.ఇద్దరి మధ్య పరిచయ మాటలు అయిన తర్వాత రైతు అడిగాడు..."ఏ పని మీద వచ్చారు" అని."నేను పొరుగూరు నించి వస్తున్నాను. కానీ ఈ దారి నాకు కొత్త. ఇటువైపు నించి మరొక ఊరులో పనుండి బయలుదేరాను. మార్గమధ్యంలో నియంత్రణ తప్పడంతో నా కారు ఓ గోతిలో పడిపోయింది. దాన్ని పైకి తీయాలి. మీ దగ్గర ఓ గుర్రం ఉన్నట్టు మీ ఊరి మనిషొకడు చెప్పాడు. ఆ గుర్రం సాయంతో ఈ కారుని పైకి తీయవచ్చని అతనో సలహా ఇచ్చి మీ చిరునామా ఇవ్వగా వచ్చాను" అన్నాడు పొరుగూరతను.పొరుగూరి మనిషి మాటలన్నీ విన్న రైతు"మీరు వచ్చిన కారు పెద్దదా చిన్నదా" అడిగాడు."పెద్దది కాదండీ....చిన్నదే..." చెప్పాడు పొరుగూరి మనిషి.రైతు సరేనని తాడు, గుర్రంతో కారు పడిపోయిన గోతి దగ్గరకు బయలుదేరాడు. అతని వెంటే పొరుగూరతనూ నడిచాడు.కారు పడిపోయిన చోటుకి చేరుకున్నారు.అక్కడి పరిస్థితిని గమనించాడు రైతు. కారు చిన్నదే. కానీ ఆ కారుని బయటకు తీస్తున్నప్పుడు తన గుర్రానికి ఏదన్నా గాయం కావచ్చేమో అని ఆలోచించాడు.ముందుగా తాను గోతిలోకి దిగి తాడుని కారుకు బలంగా కట్టి పైకొచ్చి తాడు మరొక అంచు పైకి లాగడానికి వీలుగా గుర్రానికి తగిలించాడు.కాస్సేపు అక్కడ మౌనం నెలకొంది."రామూ....ఏదీ నీ జోరు చూపించు" అని రైతు గొంతెత్తాడు ఉత్సాహంగా.రైతు గొంతు విన్నప్పటికీ గుర్రంలో చలనం లేదు."బాబూ....అయ్యవారి కారు గోతిలో దిగబడిపోయింది. మన సాయం కోసం వచ్చారు.... కారుని పైకి లాగవా" అన్నాడు రైతు.కానీ అప్పటికీ గుర్రంలో చలనం లేదు.రైతు ఈసారి స్వరం పెంచి పెద్ద పెద్దగా అరిచాడు..."నువ్వు నా రాజువిగా...నిల్చుంటే ఎలా...కారుని పైకి లాగాలి" అంటూ గుర్రం మీద చెయ్యేసాడు.అంతే మరుక్షణం, గుర్రం కారుని పైకి లాగడానికి ఉపక్రమించింది.మరో అయిదు పది నిముషాలకే గోతిలో ఉన్న కారు పైకి వచ్చింది.రైతుకి కృతజ్ఞలు చెప్పాడు పొరుగూరతను."అయ్యా, మీరు మీ గుర్రాన్ని రకరకాల పేర్లతో పిల్చారు...ఎందుకలా పిలిచారో నాకర్థం కాలేదు" అన్నాడు పొరుగూరతను."నా గుర్రానికి కళ్ళు కనిపించవు. ఈ క్లిష్టమైన పని తాను మాత్రమే చేస్తున్నట్టు అది అనుకోకూడదు కదా. తనతో పాటు మరో రెండు గుర్రాలుకూడా పక్కనే ఉన్నట్టు దానికి భ్రమ కల్పించాను. అది నా మాట నమ్మేలా మూడు పేర్లతో పిలిచాను. ముగ్గురం కలిస్తే పని చెయ్యడం తేలిక కదా అనే నమ్మకంతో అది మూడోసారి నా గొంతు వినడంతోనే కారుకి కట్టి ఉన్న తాడుని పైకి లాగింది. ప్రియమైన, నమ్మకమైన మాటలతో ఏదైనా పని చేయించుకోవచ్చు. మంచి మాటలు చెప్పడానికి డబ్బులతో పని లేదు. కానీ ఆ ప్రియమైన మాటలు మనకు సంపాదించి పెట్టేది అనంతం...." అన్నాడు రైతు.తత్త్వమేధావి పాస్కల్ అంటారు కదా..."మాటల మహిమ ఊహకందనిది. మంచి మంచి మాటలు మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు ఒకరిని నొప్పించే మాటలు మాట్లాడటం ఏ మాత్రం సముచితం కాదు. కటువైన మాటల జోలికి ఎప్పుడూ పోకూడదు. అటువంటి మాట్లాడకుండా ఉండటమే మేలు. అది అందరికీ మంచిది..." అని!
ప్రియమైన మాటలు: --యామిజాల జగదీశ్