అప్పటి నించే కన్నీళ్ళు!!: -- యామిజాల జగదీశ్

 ఓ ఇంట ఉల్లిపాయ, మిరపకాయ, టొమాటో మంచి మిత్రులు. ఇలాంటి అలాంటి మిత్రత్వం కాదు. అవి మూడు ఎప్పుడు కలిసినా కబుర్లే కబుర్లు. ఎప్పట్లాగే ఆరోజూ అవి కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు టొమాటోకి ఓ ఆలోచన వచ్చింది.
"ఎప్పుడూ మనం ఇక్కడిలా బందీగా ఉండాల్సిందేనా? బయటకు వెళ్ళి హాయిగా గడుపుదాం" అని చెప్పింది టొమాటో. 
కానీ ఉల్లిపాయ అందుకు వెనకడుగు వేసింది.  నిజమే బయటకు వెళ్ళి షికారు చేయడం. కానీ మనకేదన్నా ప్రమాదం సంభవిస్తే ఎలా ప్రాణాలు కాపాడుకోవాలి?" అంది ఉల్లిపాయ.
"ఎప్పుడూ నీకు భయమే...నా మాట విని మాతో రా. మనం ఒకరికొకరం తోడుంటాముగా. ఏ ఆపదా వచ్చినా కలిసి ఎదుర్కొందాం" అంది టొమాటో. 
టొమాటో మాటకు మద్దతు పలికింది మిరపకాయ.
అనుకున్నట్టే మరుసటిరోజే టొమాటో, ఉల్లిపాయ, మిరపకాయ ఆ ఇంట్లోంచి బయటికొచ్చేశాయి.
అవి మూడూ బయటి ప్రపంచాన్ని చూస్తూ ఎంతందంగా ఉందో అనుకున్నాయి. కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ ఓ వీధిలోకొచ్చాయి. ఆ వీధి రద్దీగా ఉంది. ఆ రద్దీ మధ్య నడుస్తూ పోతుంటే ఉన్నట్టుండి జరగకూడనిది జరిగిపోయింది.
ఒకరి పాదాల కింద టొమాటో చితికిపోయి ప్రాణాలు వదిలేసింది.
అది చూసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కన్నీరుమున్నీరయ్యాయి. 
మరికాస్త దూరం వెళ్లాక  ఉల్లిపాయకూ, మిరపకాయకూ రోడ్డుపక్కన ఓ బామ్మ పెసరట్టు వేస్తూ కనిపించింది.
పెసరట్టు వాసనతో మిరపకాయ చకచకమని పరుగులు తీసి బామ్మ దగ్గరకు ముందుకెళ్ళి నిల్చుంది.
ఐతే పచ్చిమిరపకాయ కోసం వెతుకుతున్న బామ్మ "ఓరీ ఇక్కడున్నాదా" అని అనుకుంటూ ఆ మిరపకాయను నరికి పెసర పిండిలో కలిపేసింది. దాంతో మిరపకాయ కథ ముగిసింది.
అది చూసి ఉల్లిపాయ కన్నీరు కార్చింది.
ఏం చేయాలో తెలీక ఉల్లిపాయ అక్కడికి దగ్గర్లోనే ఓ చెట్టుకింద ఉన్న వినాయకుడి దగ్గరకు వెళ్లింది.
"నా మిత్రులు మరణించినప్పుడు నేను కన్నీరుమున్నీరయ్యాను. కానీ నేను చనిపోతే నాకోసం కన్నీరు పెట్టే వారెవరూ లేరుగా...." అని బాధ పడింది ఉల్లిపాయ.
అయితే వినాయకుడు ఆ మాట విని "నువ్వెందుకు బాధపడుతున్నావు? 
నిన్ను తరుగుతున్నప్పుడే నీకోసం మనుషులు కన్నీళ్ళు కారుస్తారు. దిగులు పడకు...." అన్నాడు.
సరిగ్గా ఆ రోజు నించే ఉల్లిపాయ తరుగుతుంటే మనుషులు కన్నీరు కార్చడం మొదలైంది.