ఆటఈ మ్యూజికల్ చెయిర్ ఆట
ప్రతి ఇంట్లోనూ మనకు
తెలిసో తెలియకో
జరుగుతూనే ఉంటుంది!
నాన్న పడక్కుర్చీలో
ముద్దుల పిల్లి పిల్ల "లల్లు"
కళ్ళను మూసుకుని
దొంగనిద్ర నటిస్తుంటుంది!
వంటగదిలో
పని లేని సమయాలలో
అమ్మ కూర్చునే కిటికీ పక్కనున్న
కుర్చీ ఎక్కి
"టైగర్" కుక్కపిల్ల
ఏమీ తెలీనట్లు చూస్తుంటుంది!
రఘు టైగర్ ని ఎత్తుకుని
తన గదికి తీసుకువచ్చే వేళ
అతని బుల్లి కుర్చీలో
అక్క మీనూ యథాలాపంగా
కూర్చునుంది!
అక్క మీనూ
హోంవర్క్ రాయడం మరచిపోయి
అమ్మకు తెలీకుండా
టీవీలో పిల్లల ఛానెల్ "పోగో"
చూస్తోంది!!
ఇప్పుడు "లల్లు" పిల్లి
షికారుకెళ్ళిన వేళ
నాన్న తన
పడక్కుర్చీలో
ఆనందంగా వాలి
వార్తాపత్రిక చదువుతున్నారు!
అమ్మ కిటికీ దగ్గర కుర్చీలో
తల వాల్చి అమ్మయ్య అంటూ
సేదదీరుతోంది!!
మీనూ లేచి
పక్కకు వెళ్ళడంతోనే
రఘు తన బుల్లి కుర్చీలో
"టైగర్" ని ఒడిలో పెట్టుకుని
కూర్చున్నాడు!!
పాటలూ
సంగీతమూ
ఈలలూ వంటివేవీ లేకుండా
ప్రతి ఇంట్లోనూ
ఈ మ్యూజికల్ చెయిర్ ఆట
జరుగుతూనే ఉంటుంది!!
ఈ ఆట....:--- యామిజాల జగదీశ్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి