బల్లితో జాగరణ: -- యామిజాల జగదీశ్


 ఉండటానికేం 

అయిదడుగుల పది అంగుళాల ఎత్తున్నా

ఏం లాభం

ఉంగరం వేలంత బల్లి చూస్తే

కాళ్ళల్లో బలముండదు అడుగేయడంలో నాకు

ఉన్న రెండు కళ్ళతో చూసే శక్తి లేదు

నాకు

ఎక్కడ పైనపడి 

ఏం చేస్తుందోనని చచ్చేంత భయం

రాత్రంతా లైటు ఆర్పకుండా

ఖరీదైన మంచమెక్కి 

మెత్తటి పరుపుమీదా వాలినా

చూపూ 

మనసూ 

గోడమీద తచ్చాడుతున్న బల్లిమీదే

మనిషికి భాషంటూ వచ్చనుకుని

దానిని బల్లి అంంటున్నాడు

కానీ 

బల్లికే భాషొచ్చుంటే

మనిషిని ఏమనేదో

ఎలా చూసేదో

నా అడుగు చప్పుడికి

రివ్వున వెనక్కు పోతున్నా

నా మనసంతకంటే వేగంగా

బల్లిని చూసి వణుకుతోంది

శివరాత్రి జాగరణ మాటేమో కానీ

బల్లితో జాగరణ 

పొద్దున్నే 

నీరసంతో మంచం దిగాను

కళ్ళు బరువెక్కి.....

బల్లీ! నీకో దండం!!

నాకు నువ్వు కనిపించకుండా

నాకున్న ఆవగింజంత ధైర్యం

నాకిచ్చిపో

నీకు దణ్ణం పెడతాను!!