దొంగను పట్టిన చెట్టు.(బుజ్జిపిల్లలకు బుజ్జికథ): ౼ దార్ల బుజ్జిబాబు

  అది ఒక అడవి.  ఆ అడవిలో పెద్ద చెట్టు ఉంది. దాని నీడలో అనేక రకాల పక్షులు జంతువులు నివసిస్తూ ఉన్నాయి. వాటిలో సాధువులు ఉన్నాయి. క్రూరమైనవి ఉన్నాయి. అయినా అవి కలహించుకునేవి కావు. ఆ చెట్టు అంటే వాటి చాలా భయం. చెట్టు వాటికి కాపలాగా ఉండి కంటికి రెప్పలా కాపాడుతుంటుంది.  వాటి మధ్య ఎప్పుడైనా గొడవ వస్తే తీర్పు చెప్పేది. చెట్టు తీర్పును అన్నీ శిరసావహించేవి.
          ఇలా ఉండగా ఒకరోజు గువ్వల గూటిలో గుడ్లు పోయాయి. గువ్వల జంట దుఃఖంతో మునిగి పోయింది.
ఆ గుడ్లను పొదిగి చక్కటి సంతానం కనాలని అవి కలలు కన్నాయి. గుడ్లు మాయం అయిన సంగతి చెట్టుకు తెలిసింది. వచ్చి గువ్వల జంటను ఓదార్చింది.
           "మీరేమీ దిగులు పడకండి. దొంగను చిటికెలో పట్టేస్తా. మీ గుడ్లను మీకు అప్పగిస్తా" అంది. గువ్వలకు ఊరట కలిగింది. కాస్త తెప్పరిల్లాయి. చెట్టుమీద
అంత నమ్మకం వాటికి. 
      చెట్టుకు కంటిమీద కునుకు లేదు. దొంగను పట్టుకోవడం ఎలా? అని ఒకటే ఆలోచన. దానికి పిల్లిమీద, పాము మీద అనుమానం. ఆ రెండు తప్ప హాని చేసేవేవి అక్కడ లేవు. వాటి మీద
ఒక కన్నేసి ఉంచింది. పుట్ట వద్ద నిఘా పెట్టింది. ఎంతకీ పాము పుట్టలోకి రాలేదు. మిగిలిన జీవులన్నీ ఇల్లు చేరాయి. తీరా ఆరా తీస్తే పాము పండక్కి  అత్తవారింటికి వెళ్ళినట్లు తెలిసింది.పాము పైన అనుమానం పోయింది. 
             ఇక మిగిలింది. పిల్లి. అనుకున్నట్టుగానే అర్ధరాత్రి మెల్లగా వచ్చింది పిల్లి. అటూ ఇటూ చూసింది.
చెట్టు ఎక్కబోయింది. వెంటనే చెట్టు పిల్లిని నిలదీసింది.
పిల్లి భయంతో గడగడా వణకింది. చేసిన తప్పు ఒప్పుకుని చెంపలు వేసుకుంది. దొంగిలించిన
గుడ్లను తెచ్చి చెట్టుకు అప్పజెప్పింది. ఎవరికి చెప్పవద్దని వేడుకొంది.
         పిల్లిని క్షమించింది చెట్టు. గుడ్లను గువ్వల జంటకు అప్పజెప్పింది. వాటి ఆనందానికి అవధులు లేవు. గుడ్లను చూసి మురిసిపోయాయి. చెట్టుకు
కృతజ్ఞతలు తెలిపాయి. 
 దొంగ ఎవరో ఇప్పటికి ఎవరికి తెలియదు. చెట్టుకుతప్ప.
 నీతి: మనకు తెలిసిన రహస్యం మనలోనే దాచుకోవాలి