జాగ్రత్త!:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 అవును!

నాకు ఓపిక నశించిపోయింది

పిక్క పట్టుకుని పీకేశాను

బారెడు కండ ఊడిపడింది

చెంబుడు రక్తం కారిపోయింది

వాడికి బొడ్డు చూట్టూ

పద్నాలుగు ఇంజెక్షన్లు

నాకేమో మరి ఒకటే!

రోగం అణిగింది వాడికి

మళ్ళీ ఎప్పుడూ నాతో

పిచ్చివేషాలు వెయ్యలేదు

అంటే........, వాడు

నన్ను పడుకోనివ్వడు

అన్నం తిననివ్వడు

అస్తమానం నా కాలూ,

చెవీ,తోకా లాగుతుంటాడు

నన్ను టీవీ చూడనివ్వడు

అద్దం చూసుకోనివ్వడు

పూజగదిలోకి రానివ్వడు

వాడి గదిలోకీ రానివ్వడు

అప్పుడప్పుడు

డాడీతో చాడీలు చెప్పి

నాకు బడితపూజ

చేయిస్తుంటాడు

అందుకే మరి....

సన్నీగాడిని గట్టిగా కొరికేశా

మరి ...మీరూ జాగ్రత్త సుమా!

సన్నీగాడిలా చేయకండి

మీ డాగీ కూడా

నాలాగే చేయగలదు!!