ఎందుకు పుట్టినట్టో.:- వసుధారాణి.

 నా రాణెమ్మ కథల్లో మొదటి కథ బుల్లిరాణిలో నేను 7వ ఆడపిల్లగా పుట్టినా కూడా మా అమ్మ ఆనందంగానే ఉంది ,అని వ్రాసిన వాక్యం .మా అబ్బాయి గోపాల్ ఇంగ్లీషులోకి తర్జుమా చేసి   వాడితో పాటు phd చేస్తున్న జగదీప్ కౌర్ అనే అమ్మాయికి చెపితే ,ఆపిల్ల ఆశ్చర్యంగా మీ గ్రాండ్ మా గ్రేట్, మా అమ్మ నేను మూడవ ఆడపిల్లగా పుడితేనే దిగులు పడింది , ఇంట్లో అందరూ మళ్ళీ ఆడపిల్లేనా అన్నారట అని చెప్పిందట.
మా వాడు ఈ మాట చెప్పిన దగ్గరి నుంచి ఒకటే దిగులు ఆవురించింది నన్ను. భారతదేశం కి చెందిన అమ్మాయి ఏదేశం వెళ్లినా తన జననం తాలూకూ ఉలికిపాటును వదల్లేకపోవటం ఎంత బాధగానో తోచింది. మా అమ్మ మీద బోలెడు ప్రేమ గౌరవం కూడా కలిగింది ఏడవ ఆడపిల్లగా, అష్టమ సంతానంగా నన్ను ఆనందంగా స్వీకరించడం పై.
పుట్టినరోజు అంటే  సంతోషంతో పాటు కొంత వైరాగ్యం కూడా వస్తుంటుంది నాకు. వైరాగ్యం మాట కాసేపు పక్కన పెడదాం.సంతోషం సంగతి చూద్దాం ముందు.పెళ్లి తర్వాత కన్నా బాల్యంలో నేను జరుపుకున్న పుట్టినరోజులు నాకు చాలా విలువైనవి.
మార్చ్ 29 తెలుగు తేదీల ప్రకారం చైత్ర పౌర్ణిమ నాపుట్టినరోజు.చిన్నిక్లాసుల్లో బలపాలు, తర్వాత పెన్సిళ్లు పంచటం దశనుంచి స్నేహితులని ఇంటికి పిలవడం దాకా ఎదిగినప్పుడు. మాఅమ్మ ఎంత చక్కగా ప్రేమగా శ్రద్ధగా నా పుట్టినరోజు చేసేదో. మా సావిత్రి అక్కయ్య సాదా కొత్తచీర ఒకటి కొని ,నాకు మాచిన్నారికి ఓకేరకం లంగా జాకెట్లు కుట్టేది.నా పుట్టినరోజు తర్వాత మా అక్కయ్య కూతురు చిన్నారి పుట్టినరోజు ఏప్రియల్ 13 న వచ్చేది.అమ్మ అడ్రస్సుకు మ్యాచింగ్ రిబ్బన్లు,గాజులు కొనేది.ఉదయాన్నే  తలంటి హారతి ఇచ్చేది.కొత్తబట్టలు వేసుకుని అమ్మమ్మకి, నాన్నకి అమ్మకి పాదనమస్కారం చేసేదాన్ని.
సాయంత్రం ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిస్తే చిలకడ దుంపలు బాగా వచ్చే రోజులు కదా వాటితో హల్వా చేసేది.అలాగే నాకు ఇష్టం అని ఆలూబోండా చేసేది. నాపుట్టిన రోజు అంటే స్నేహితులకు ఈ రెండు ఇంక ఆనవాయితీగా అలవాటైపోయింది ఇంక.
పెళ్ళిఅయిపోయి వెళ్ళిపోయాక  కూడా ఎప్పుడైనా పుట్టిరోజుకు అమ్మదగ్గర ఉంటే చిలకడదుంప హల్వా,ఆలూబోండానే చేయించు కునేదాన్ని. ఇంతమంది పిల్లల పుట్టినరోజులు ,పండగలు, ఏవైనా ఆవిడ ఇంతే ఇష్టంతో చేసేది.చేసే పని ఏదయినా దానిపట్ల శ్రద్దని,ప్రేమని కలిగి ఉండటాన్ని మా అమ్మనుంచి నేర్చుకున్నా .
ప్రాణమిత్రులు జరిపిన కొన్ని  పుట్టిన రోజులు ,కొన్ని మరిచిపోలేని మధురమైన పుట్టినరోజులు,పిల్లలతో గడిపినవి చాలానే గొప్ప పుట్టిన రోజులు ఉన్నాయి తర్వాతి కాలంలో.
 వైరాగ్యం పైన ఎక్కడో వదిలేసి నట్లున్నాం ఆ విషయానికి వద్దాం.పైకి ఆకతాయితనంగా ఉన్నా అంతర్ముఖంగా కొంచెం సీరియస్ మనిషిని నేను.ఎంత జీవితం వృధా చేసాము అన్న వైరాగ్యం ఒచ్చిపడుతుంటుంది వద్దన్నా పుట్టిన రోజునాడు.ఆ ఒక్కరోజే సుమీ. మర్నాడు మళ్ళీ మామూలే బద్ధకం నా చిరునామా మరి.