వసంతం నుంచి వసంతం దాకా..:- వసుధా రాణి

 ఒక్క చెట్టుకూడా లేని చిన్న నల్లరాతి బోడి గుట్ట.గుట్ట పక్కనే ఓ పెద్ద చెరువు గుట్ట చుట్టూ, చెరువు చుట్టూ ఎటు చూసినా పచ్చని తోటలూ ,చేలూ.
ఓ ప్రయాణంలో దారి వెంట సాయంకాలం వేళ కనపడిన అద్భుతమైన దృశ్యం ఇది.కారు ఆపేసి సూర్యాస్తమయం అయ్యే వరకూ చెరువు గట్టుపైన కూర్చున్నాం. పరుగులు ఆపి కాస్త సమయం మనకోసం మనం కేటాయించుకుంటే ఇలాటి అద్భుతం మన సొంతం కదా అనిపించిన క్షణం.
శీతాకాలం పగళ్ళు,వేసవి రాత్రులు ఎంత గొప్పగా ఉంటాయో కదా.వెలుగు నీడల చిత్రాలు శీతాకాలంలో చాలా ఆహ్లాదంగా ఉంటాయి.చలిరాత్రి అంటించిన బద్ధకాన్ని కాస్త కాస్త వదుల్చుకుంటూ ఎండపొడన కూర్చుని ఏటవాలు ఎండ చెట్లతోనో,తీగలతోనో సృష్టించే నీడల చలన చిత్రం చూడటం కన్నా గొప్ప అనుభవం ఏమీ ఉండదు.బద్ధకాన్ని సెలబ్రేట్ చేసుకున్నట్లుగా అనిపిస్తుంది.
వేడి,ఉక్కపోత,చెమట ఇవన్నీ అనుభవమిచిన రోజు చీకటి పడే వేళకి కాస్త చల్లగాలిని తోడు పిలుచుకుని సేదతీరేవేళ కాసిని మల్లెలు కూడా అక్కడ చేరితే వచ్చే  జీవితానందం అందరికి అనుభవమే.
దారి వెంటనున్న ఆ గుట్ట,చెరువు దగ్గర ఓ గంటకాలం జీవితాన్ని ఆపేసినప్పుడు అనిపించింది.భూమి మీద ఏ ప్రదేశం అయినా ఒక్క ఏడాది కాలం పాటు ఋతువులకు అనుగుణంగా తను రూపంతరం చెందుతూ ఉంటుంది కదా.ఈ గుట్ట,ఈ చెరువు,ఈ చెట్లు,ఈ సూర్యుడు ఇక్కడ ఒక వసంతం నుంచి మరో వసంతం వరకూ ఎలా మారుతుంటారో చూస్తే ఎంత బాగుంటుంది.
ఎక్కడైనా,ఏ ప్రదేశం అయినా  సరే ప్రకృతిని వసంతం నుంచి వసంతం వరకు చూస్తే కానీ ఆ ప్రదేశం అందాలు అన్ని వేళలలో ఎలా ఉంటాయో తెలియదు.ఏ సంగతి ఎలా ఉన్నా ముందు కళ్ళముందు కనపడిన అందమైన సూర్యాస్తమయాన్ని కనులలో నిలుపుకుని వచ్చాం.
ఇప్పుడు అక్కడ ఎలా ఉండి ఉంటుందో ? గుట్ట నీడ చెరువులో పడుతూ,మామిడివనాల నీడన పిల్లలు ఆటలాడుతూ, చెరువు నీటిలో ఈతలు కొడుతూ ,గడ్డి మేస్తున్న పశువులపై కొంగలు స్వారీ చేస్తూ,గుట్టను చుట్టి సుడితిరిగిన అల్లరి గాలి ఈలలు వేస్తూ.ఒక్క నేను తప్ప చిత్రమంతా రంగులు రంగులుగా వసంతం ఆడుతోంది ఆలోచనలలో.