ఏదన్నా జరగొచ్చు:-- యామిజాల జగదీశ్
 అనగనగా ఒక రాజు. ఇలా కథా ప్రారంభం విని చాలా కాలమైంది నావరకైతే. అందుకే అలా మొదలుపెట్టాను ఈ కథను అనగనగా అంటూ. 
ఆ రాజు తన నౌకరు చేసిన తప్పుకి మరణదండన విధించాడు. 
నౌకరు తప్పుకి ఈ శిక్ష మరీ మరీ పెద్దదని అందరూ భావించారు. చెవులు కొరుక్కున్నారుకూడా. 
కొందరు సాహసించి రాజుగారిని కలిసి ఈ శిక్షను పునఃపరిశీలించమన్నారు. 
నౌకరుకూడా బతిమాలాడు. 
కానీ రాజు మనసు కరగలేదు.
ఎట్టకేలకు రాజు ఓ మాటన్నాడు. 
తాను విధించిన మరణశిక్షను తగ్గించాలంటే ఓ షరతు పెట్టాడు. 
తన దగ్గరున్న గుర్రాన్ని ఆకాశంలో పక్షిలా ఎగిరేలా చెయ్యాలన్నాడు రాజు.
నౌకరు సరేనన్నాడు. 
గుర్రం ఎగరడానికి ఏడాది గడువివ్వాలని కోరాడు నౌకరు. అప్పుడు తాను గుర్రాన్ని ఎగరనివ్వలేకపోతే నాకు మరణశిక్ష అమలు చేయండి అన్నాడు ఎంతో వినయంగా.
అలాగే అన్నాడు రాజు. 
అనంతరం నౌకరు గుర్రంతో తన స్థావరానికి బయలుదేరాడు.
అతనిని చూసి మిత్రులు "నీకేమన్నా పిచ్చా? గుర్రం ఎలా ఎగురుతుంది? దానికి రెక్కలు లేవుగా? ఏడాది తర్వాత నువ్వు మరణించడం తథ్యం" అన్నారు.
వారి మాటలన్నీ విన్న నౌకరు "ఏడాది అనేది తక్కువ కాలం కాదు. ఈ కాలంలో ఏదన్నా జరగొచ్చు. గుర్రం చనిపోవచ్చు. లేదా నాకే సహజ మరణం సంభవించవచ్చు. లేదా రాజుగారే చనిపోవచ్చు. లేదా రాజుగారి మనసు మారొచ్చు. శిక్ష తగ్గించొచ్చు. అంతేతప్ప ఏడాది తర్వాత ఏం జరుగుతుందోనని ఇప్పటి నించే దిగులుపడటం దేనికీ?" అన్నాడు.
ఈనాటి సమస్యకు మనం పరిష్కారమార్గం చూడాలి. రేపు ఏం జరుగుతుందోనని తల బద్దలు కొట్టుకోవడం అర్థంలేనిది.