ఉత్తరాల బొత్తి: -సత్యవాణి

 నిద్రపట్టదు నాకు
మనసు గాయపడితే
నిద్రపట్టదు నాకు
మనసుకు సంతోషం కలిగినా నిద్రపట్టదు
అర్థరాత్రి వరకూ గదిలో అటూ ఇటూ తిరుగుతాను
మంచం ఎక్కుతాను దిగుతాను
దీపం ఆర్పుతాను వేస్తాను
పుస్తకంతీస్తాను 
పేజీలు కానీ కదలవు
దృష్టి పుస్తకంపైనిలవదు
అప్పుడు గుర్తుకొస్తుంది
నా ఉత్తరాల బొత్తి
తీసుకొస్తాను దానిని
తీరిగ్గా మంచంపై కూర్చుంటాను
 బొత్తినుండి
ఊడదీస్తాను ఒక్కొక్కకమ్మను
చకచకా చదువుతూంటాను ఒకటీ ఒకటీ
కార్డులు కవరులు ఇన్ లాండ్ లు  శుభలేలు
రకరకాల కమ్మలు
ఆత్మీయ బంధువు అమ్మాయి పెళ్ళిశుభలేఖ
ఇన్నాళైనా ఇగిరిపోని కునేగావారి సెంటు పరిమళం
గుండెల నిండుగాఆఘ్రాణిస్తాను
అంతే ఆనాటి ఆ పెళ్ళిలో జరిగిన ముచ్చట్లు కన్నులఎదుట సాక్షాత్కారమౌతాయి
నాకు ప్రమోషనొచ్చిందని నేనురాసినప్పుడు
ఆత్మీయ బంధువుల అభినందనల ఉత్తరాలు
నాకు సంబధం నిశ్చయమైనట్లు పెళ్ళికి సెలవుపెట్టి రమ్మని నాన్న రాసిన ఉత్తరం
కొత్తకాపురానికై నాభాగ్యదేవత నట్టింట కాలూనడానికై వస్తున్నట్లు 
రాసిన తియతీయని సమాచారం
నాకలలపంటగా
నాబంగారు తండ్రిగా
నాకు కొడుకు పుట్టినట్లు 
మావగారు రాసిన మరపురాని ఈత్తరం
అక్క ఆత్మీయతతో రాసిన ఉత్తరాలు 
అభిమానం కురిపిస్తూ
బావ బెట్టుసరి ఉత్తరాలు
తమ్ముడి ఆర్థిక అవసరాల ఉత్తరాలు ఇల్లుఖాళీచేయవలసిందని
ఇంటాయన రాసిన నోటీసు లాంటి ఉత్తరాలు
నాఇంటి గృహప్రవేశానికై అచ్చొత్తి దేవుడి వద్దనుంచిన మొదటి శుభలేఖ
స్నేహితులనుండి స్నేహపరిమళాన్ని మోసుకొచ్చిన ఎన్నెన్నో ఉత్తరాలు
నాకు మనవడు కల్గినట్లు
వియ్యంకుడినుండివచ్చిననన్ను సంతోషపరచిన లేఖ
నవరసాలొలింకించే నా ఉత్తరాల బొత్తి
దాన్ని ఒక్కసారి
నా హృదయానికి హత్తుకొంటాను
పెదవులకు తాకించు కొటాను
మనసు తేలాకౌతుంది
సన్నజాజులపరిమళంలా
జ్ఞాపకాలు చుట్టుముడతాయి
మనసుకు చలచల్లని సుగంధం అలదినట్టై
హాయి హాయిగా నిద్ర చేరువౌతుంది
తియతీయని కలలతెర
కనురెప్పల వెనుక సాక్షాత్కారమౌతుంది