ప్రాథమిక విద్య.:వసుధారాణి


 


'బలవంతుడు నాకేమని' సుమతీ శతకంలోని పద్యాన్ని ,'అల్పబుద్ధివానికధికారమిచ్చిన' పద్యాన్ని  తరగతిలోని పిల్లలందరితో కలిసి పెద్ద గొంతుకలతో అరిచి అరిచి వల్లె వేసిన బాల్యం దాదాపు మన అందరి ప్రాథమిక విద్య . నేనయితే పై పద్యాలలో చలి చీమల చేత చిక్కిన పెద్ద పాము, చెప్పు తినేటి కుక్క ఈ రెండింటిని ఈస్టమన్ కలర్ లో ఊహించుకునే దాన్ని.


ఇసుకలో ,మట్టిలో అక్షరాలు దిద్దిన మన పెద్దల ప్రాథమిక చదువు నుంచి మట్టిపలకలు,రాతి బలపాలు,పిండి బలపాలకు మారిన మన చదువుల సమయం ప్రాథమిక విద్యకు స్వర్ణ యుగమని నా అభిప్రాయం.


నాలుగవ తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటా 6,7 తరగతులకు లెక్కలు చెప్పే నారాయణ మాష్టారు ఖాళీ పిరియడ్ లో మా క్లాసుకు వచ్చి జనవరి నుంచి డిసెంబర్ వరకు వచ్చే నెలలలో 30 రోజులు ఏ నెలలకు, 31ఒక్క రోజులు ఏ నెలలకు వస్తాయో చేతులు వెనక్కి తిప్పి వేళ్ళ మధ్య వచ్చే ఖాళీలతో ఓ సూత్రం నేర్పించారు.ఇప్పటికీ ఈ నెలలో ఎన్ని రోజులు అని అనుమానం వస్తే అదే సూత్రం ప్రకారం చూసుకుంటాను.


వ్యక్తిత్వం ఏర్పడటానికి సహకరించే చదువు ప్రాథమిక విద్య ద్వారానే వస్తుంది కదా.ఆడుతూ పాడుతూ చదివిన చదువు పిల్లల మస్తిష్కం లో అలా ఉండి పోతుంది.


ఎన్నో తరగతిలో పాఠ్యాంశంగా వచ్చిందో గుర్తులేదు కానీ పోతన భాగవత పద్యం 'సిరికిం జెప్పడు' పద్యం వలన పాలసముద్రం, గజేంద్రుణ్ణి రక్షించటానికి హఠాత్తుగా బయలుదేరిన విష్ణుమూర్తి ,  విష్ణువు చేతిలోనున్న తన చీర  కొంగు కోసం తత్తరపాటుతో వెనుకే వచ్చిన లక్ష్మీదేవి ,తమంతట తాముగా స్వామి చేతుల్లోకి చేరిపోయిన శంఖ చక్రాలు, గరుడుడు ,వెంబడించిన మిగతా పరివారం ఇవన్నీ ఒక దృశ్యాత్మక రూపాలుగా కళ్ళముందుకు ఆ పసి వయసులో మాకు వచ్చాయి అంటే ,ఆ గొప్పతనం ప్రాథమిక విద్యదే.


చిన్న చిన్న నీతికథలు,బడిలో పిల్లలందరం కలిసి ఆడిన ఆటలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో తోడ్పడ్డాయి.

చెలిమి బలిమీ,చదువు కలిమీ నేర్పిన  ప్రాథమిక విద్యా,మాకు అందించిన ఉపాధ్యాయులూ కూడా ప్రాతఃస్మరణీయులు.


జీవితాన్ని అతి సాధారణంగా గడపటం అన్న గొప్ప లక్షణం మా కాలం ప్రాథమిక విద్య నేర్పిన మూల సూత్రం. తరగతి వాచకాలను ధనసంపాదనను నేర్పే సాధనాలుగా కాక మనోవికాసానికి ఉపయోగపడే విధంగా రూపొందించిన విద్యను అందుకున్నాం.అందుకే నేమో కొద్దో గొప్పో జీవితానందాన్ని పొందుతున్నాం.