కవనపవనాలు:-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి, సికింద్రాబాద్.


 ఏకపది:(కార్తీకం)

*******

శివునికి ప్రీతిపాత్రమై_శరత్తుకు‌ ఆలవాలమై నిలుచునది.

ద్విపదం:(అభిషేకం)

*******

హర హరయని లింగంపై ధారగా పోసే జలం.

నిటలాక్షుని‌కి నిత్య శుభ్ర సేవనం.

త్రిపదం:(ఉపవాసం)

*******

దైవానికి‌ దగ్గరగా ఉండే దర్శనం.

శారీరక సమతుల్యతకు‌ యోగవితానం.

విషయవాంఛల విసర్జనకు సాధనం.

లఘుకవిత:(పదిలం)

**********

పయిలం పదిబిడ్డలారా!

పరీక్షలు బతకడానికే!

పయిలం పంతుళ్లారా!

కర్తవ్యం బతుకుకోసమే!

అధికారులకు ప్రాణసంకటం

వ్యవస్థకు నిత్యసమరం

తల్లిదండ్రులకు ధర్మసంకటం

వైరసుకు అదనపు అవకాశం

తప్పని తిధుల తద్దినం.

జాగ్రత్తలు పాటించాల్సిన తరుణం.

మానసిక ధృడత్వమే మార్గదర్శనం.

వచనకవిత్వం:(ఈషణత్రయం)

************

చంచలమైన లక్ష్మి కోసం

నిరంతరం నిత్యాన్వేషణ

"ధనమూలమిదంజగత్" అనే

భావనతో అలుపెరుగని ఆరాటం

వంశాంకురమే మూలమబే అజ్ఞానం

పున్నామనరకం నుండి తప్పిస్తాడని

అతివ్యామోహంతో తాపత్రయం

సహధర్మచారిణియై గృహస్థజీవితంలో 

కర్మానుసారి యవుతుందని ఆపేక్ష

బాధ్యతలను చక్కనబెెట్టి,బంధంతో

అనుబంధాలు పెంచి,అనుకూలవతియవుతుందని

కళత్రంపై అనిర్వచనీయమైన ప్రేమ

ఈషణత్రయంతో మానవుడు

సంసారబంధంలో బందీయవుతున్నాడు 

మోహ కాంక్షపరుడై భవబంధాలకు

బందీ అవుతున్నాడు

సత్యమేమిటో,ముక్తి యేమిటో

తెలుసుకొని నడవాలి

సదా గోవిందునిసేవలో లీనమవ్వాలి.

నానీ:(కార్తీక పౌర్ణమి)

****

వేన వేల వెలుగుల

జ్వాలాతోరణం.

నదీస్నానాల పవిత్ర

సంగమం.