సామెత కథ : -ఎం బిందుమాధవి

 "సత్రం భోజనం మఠం నిద్ర"
కళ్యాణికి చదువైపోగానే క్యాంపస్ సెలెక్షన్ లో ఉద్యోగం వచ్చింది.
కంపెనీ వాళ్ళు పోస్టింగ్ బెంగళూర్ లో ఇచ్చారు.
పిల్లల్ని ఎప్పుడూ వదిలిపెట్టి ఉండని తండ్రి కృష్ణమూర్తి, పిల్ల ఒక్కర్తీ అక్కడ ఎలా ఉంటుందో! పిల్ల క్షేమ సమాచారాలు ఇచ్చేటందుకు తనకి తెలిసిన వారు ఎవ్వరూ అక్కడ లేరని ఒకటే బెంగ పడిపోతున్నాడు.
పెద్ద కూతురు కూడా ఇలాగే చదువవ్వగానే ఉద్యోగంలో చేరినా, పోస్టింగ్ ఆ ఊర్లోనే ఇచ్చారు కాబట్టి ఏ బెంగా పడలేదు. అతనికి ఆడపిల్లలు బయటి ఊళ్ళల్లో ఒంటరిగా ఉద్యోగం చెయ్యటం గురించి పెద్దగా తెలియదు. అలా చేస్తున్న ఆడపిల్లలు తన పరిధిలో వ్యక్తిగతంగా అతనికి తెలియరు. తల్లి వండి పెడుతుంటే తిని సాయంత్రం చీకటి పడేలోపు ఇంటికి చేరుతున్న పిల్లలే తెలుసు.
సరే ఉద్యోగంలో చేరే రోజు వెళ్ళి పిల్లని దిగబెట్టి, ఇల్లు - వాకిలీ అన్నీ చూసి, ఇంకా కొంత మంది అమ్మాయిలు తన కూతురులాగే ఉద్యోగంలో చేరటానికి ఒంటరిగా రావటం చూసి స్థిమిత పడ్డాడు.
*********
రోజు ఫోన్ చేసి భోజనం చేస్తున్నదో లేదో అని ఒకటే ఆదుర్దా వ్యక్త పరిచేవాడు. అసలే ఇంట్లో ఎప్పుడూ వంట చేసి ఎరగదు! కొత్త ఉద్యోగం - పని ఒత్తిడి!
తండ్రి బెంగ చూసి కళ్యాణి ******* 'నాన్నా ఇక్కడ మా ఇంటి ఆవిడే నెలకింత అని డబ్బు తీసుకుని, మా అందరికీ క్యారేజ్ సప్లై చేస్తున్నది. కూరలు తెచ్చుకోవటం - వంట చేసుకోవటం అనే బాదరబందీ లేదు. హాయిగా ఆఫీస్ నించి వచ్చేసరికి ఆవిడ పంపించే భోజనం చేసి, కాసేపు కబుర్లు చెప్పుకుని నిద్ర పోతున్నాము. జీవితం హాయిగా గడుస్తున్నది. నువ్వేమీ నా గురించి బెంగ పడకు ' అని చెప్పాక కృష్ణ మూర్తి గుండె మీద చెయ్యేసుకుని నిద్రపోయాడు.
వీలున్నప్పుడల్లా పండుగలకి వచ్చి వెళుతున్నది.
అమ్మా-నాన్నా, మామ్మా-తాతయ్యా, బాబాయి-పిన్ని, అక్కా, తమ్ముడు ****** ఇలా అందరితో నిండైన జీవితం! ఉద్యోగంలో గుర్తింపు, నెలకి ఐదంకెల జీతం ***** జీవితం "నల్లేరు మీద బండి" లాగా, ఇంకో విషయం ఆలోచించే తీరిక లేకుండా గడుస్తున్నది.
*********
ఓ ఏడాది గడిచాక తల్లి పెళ్ళి ప్రస్తావన తెచ్చింది. 'అమ్మా నేను ఇప్పుడిప్పుడే ఉద్యోగం ఎంజాయ్ చేస్తున్నాను. నాకు మంచి పేరు కూడా వచ్చింది. ఆరు నెలల్లో ప్రమోషన్ ఇస్తామన్నారు. భోజనం గురించి, నా క్షేమం గురించి బెంగ కూడా లేదు. ఇప్పుడే ఆ ఆలోచన వద్దని ' నిర్మొహమాటంగా చెప్పేసింది.
అలా నాలుగేళ్ళు గడిచింది.
*********
కళ్యాణి తల్లి విజయ కూడా కొన్నాళ్ళు ఉద్యోగం చేసింది. పిల్లలు పెద్దయ్యేసరికి ఉద్యోగం మానేసింది. ఇంటిపట్టున ఉండి వారి చదువు-సంధ్యలు, అత్తమామల ఆరోగ్య అవసరాలు అన్నీ తీర్చటం కూడా ఉద్యోగమంత ముఖ్యమనే భావనలో ఉండేది. పిల్లలకి మొదటినించీ ఇల్లు అంటే పువ్వులు - కాయలు- పండ్లు ఉండే నిండైన చెట్టు లాంటిది అని చెప్పేది.
కానీ విజయ పెంపకానికి విరుద్ధంగా కళ్యాణి ఉద్యోగమే ముఖ్యమనటం ఆమోదించలేక పోయింది.
సంక్రాంతి పండుగకి వచ్చిన కళ్యాణి - ఇంట్లో భోగిమంటల సందడి, రంగు రంగుల ముగ్గులు, బొమ్మల కొలువు పేరంటం, తమ్ముడు ఎగరేసిన గాలిపటాలు - పిండి వంటలతో కుటుంబ సభ్యులందరి మధ్య పూర్తిగా సంతోషంగా గడిపి, మరునాడు వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంది.
ఆ రాత్రి భోజనాలయ్యాక ' అమ్మా నాలుగు రోజులు నాలుగు నిముషాల్లాగా గడిచిపోయాయి, టైమే తెలియలేదు. రేపటినించీ మళ్ళీ ఆఫీస్, సాయంత్రమయ్యేసరికి కాళ్ళీడ్చుకుంటూ ఇంటికొచ్చి ఒంటరిగా తాళం తీసుకుని కాసేపు ఆఫీస్ పని చూసుకుని ఒక్క దాన్నే ఏదో తిన్నాననిపించి పడుకోవటం! లైఫ్ యాంత్రికంగా అనిపిస్తున్నది ' అన్న కళ్యాణి మాటలకి విజయ కూతురితో - 'చూశావా అన్నీ ఉన్న జీవితమే ఆనందంగా ఉంటుంది. కేవలం ఆకర్షణీయమైన జీతం, ఉద్యోగంలో హోదా, మన ఉనికిని -సహాయాన్ని కోరుకోని బేషరతు జీవితం ఎప్పుడూ తృప్తినివ్వవు. అందుకే మీకు చిన్నప్పటి నించీ అన్నీ ఉన్న, సమగ్రమైన జీవితమే శాశ్వతమైన తృప్తిని, ఆనందాన్ని ఇస్తాయి అని చెప్పేదాన్ని.'
'ఉద్యోగం వచ్చిన కొత్తల్లో సెలవు దొరకగానే నీకిష్టమైన నానమ్మ-తాతయ్యలు, అక్కా-తమ్ముడు ఉన్నారని పరుగెత్తుకొచ్చేదానివి. కుటుంబం అంటూ ఉన్నది కనుక వాళ్ళు ఉన్నారు.'
'కానీ మేము ఎల్లకాలమూ ఉండము. మాకూ వయసు వస్తుంది. ఎప్పుడో అప్పుడు రాలి పోతాము. అప్పుడు నీకంటూ ఒక కుటుంబం ఉండాలి. చెట్టు నీడ విలువ దాని కింద నిల్చున్నంత సేపు తెలియదు. బయటికి వచ్చాకే తెలుస్తుంది.'
'ఇప్పుడు చదువులు అవ్వగానే వచ్చే ఉద్యోగాలతో, ఆడ పిల్లలు, మగ పిల్లలు కూడా "సత్రం భోజనం - మఠం నిద్ర"లతో పెళ్ళి అనే విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. తాత్కాలికంగా ఉన్న ఆ పరిస్థితినే ఆనందం అనుకుంటున్నారు. పెళ్ళి చేసుకోవటం అంటే... అదేదో పెద్ద బండ రాయిని మోస్తున్నట్టు, తలనొప్పిని కోరి ఆహ్వానిస్తున్నట్టు భావిస్తున్నారు. చిన్న చిన్న విషయాలని కూడ ఎంతో పెద్దవిగా ఊహించుకుని కదిలిపోతున్నారు. అతిచిన్న పరిష్కారాలని కూడా ఆలోచించలేకపోతున్నారు.'
'కుటుంబసభ్యుల మధ్యలో మసిలేటప్పుడు భావోద్వేగాలకి ఒక వెంటిలేషన్ అనేది దొరుకుతుంది. నలుగురితో సరదాగా మాట్లాడుతూ ఉంటే తెలియకుండానే పరిష్కారాలు దొరుకుతాయి.'
'ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు ఊ( అంటే నాన్నగారిని సంబంధాలు చూడమంటాను. నీకు ఓ కుటుంబం అనేది ఏర్పడితే, జీవితం ఆహ్లాదంగా, ఆనందంగా, ఆకర్షణీయంగా కనపడుతుంది.' అని ముగించింది.