కరివేపాకు -ఔషధ గుణాలు..: - పి . కమలాకర్ రావు .


  కరివేపాకులో కమ్మని  రుచి తో పాటు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కరివేపాకు కాలేయానికి  ప్లీహానికి మేలు చేస్తుంది. అనేక ఉదర సమస్యలను పోగొడుతుంది. కడుపులోని గ్యాస్ ను నివారిస్తుంది. రక్త వృద్ధికి తోడ్పడుతుంది. జుట్టు రాలకుండా కాపాడుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది.

 కొన్ని కరివేపాకులను శుభ్రంగా కడిగి ముద్దగా నూరి  నువ్వుల నూనెలో పచ్చివాసన పోయేంత వరకు వేయించి  అందులో శోంటి , మిరియాల పొడి మరియు ఇంగువ వేసి నీరు పోసి కషాయం తయారు చేయాలి. ఇది కాలేయానికి శక్తినిస్తుంది. జుట్టు రాలకుండా కాపాడుతుంది. ఇది వరుసగా కొన్నాళ్లు తాగితే కెమోథెరపీ తో రాలిన జుట్టు కూడా మళ్లీ మొలుస్తుంది. ఇది కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది.

కరివేపాకు ముద్దలో ఖర్జూర పండు వేసి మరిగించి చల్లార్చి తాగితే మంచి రక్తవృద్ధి కలుగుతుంది.

 ఉదర సమస్యలు తగ్గడానికి  కరివేపాకు ఈనెలు, ఉసిరి ఈనెలు, మరియు వేపాకుల ఈనెలు అన్నీ కలిపి నలగ్గొట్టి నీటిలో వేసి జిలకర్ర పొడి శోంటి, మిరియాల పొడి వేసి మరిగించి చల్లార్చి తేనె కలిపి త్రాగాలి. ఇది ఉదర సమస్యలతో పాటుగా కడుపులోని గ్యాస్ ను నివారిస్తుంది.

కరివేపాకును చెట్నీ  చేసుకొని తినాలి. కరివేపాకును ఎండబెట్టి పొడిచేసి అందులో ఎండుమిర్చి కారాన్ని  పోపుదినుసులు వేసి పొడిగా భోజనంలో తినవచ్చు. ఇది అధిక బరువును తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర ను కూడా నియంత్రిస్తుంది.