చిలగడ దుంపలను ఉడికించి పై పొట్టు తీసి వేసి చాలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఆ తరువాత నేతిలో దీనిని వేసి వేయించాలి, బెల్లం పాకం గాని చక్కెర పాకం గాని తయారుచేసి అందులో యాలకుల పొడి వేసి చిలగడ దుంప ముక్కలలో తీయని పాకం కలుపుకోవాలి. చాలా రుచికరమైన తియ్యని వంటకం తయారవుతుంది.చిన్నపిల్లలు దీనిని చాలా ఇష్టంగా తింటారు. ఇది మంచి బలమైన ఆహారం. సన్నగా కనపడే పిల్లలు ఇది తింటుంటే బరువు పెరిగే టట్టు చేస్తుంది.చిలగడదుంప ఆకులను ముద్దగా నూరి చర్మవ్యాధుల పై పూతగా పూస్తే చర్మవ్యాధులు తగ్గిపోతాయి. చర్మం నున్న బడుతుంది. చిలగడదుంప సూప్ తయారీ విధానం:-చిలగడ దుంపలను పై పొట్టు తీసివేసి సన్నని ముక్కలుగా తరుక్కోవాలి. కొన్ని పండిన టమాటలను కూడా ముక్కలు చేసుకుని పెట్టుకోవాలి. కొద్దిగా ఒక గిన్నెలో నూనె వేసి పోపు దినుసులు వేసి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఉల్లిపాయలు కూడా వేసి అందులో చిలగడ దుంప ముక్కలను మరియు టమాటా ముక్కలను వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత నీరు పోసి మరిగించాలి. కొద్దిగా మిరియాల పొడి ధనియాల పొడి తగినంత ఉప్పు వేసి కాసేపు మరిగిన తర్వాత కమ్మని సూప్ రెడీ అవుతుంది. బాగా అలసిపోయినప్పుడు ఇలాంటి సూపు త్రాగితే త్వరగా అలసట తీరి ఉత్సాహంగా తయారవుతారు.
చిన్నపిల్లలకు శక్తినిచ్చే ఆహారం- చిలగడదుంప...: - పి . కమలాకర్ రావు