ఒక కోడిపిల్ల ఉండేది. అది పుట్టి మూడు రోజులయింది. దానికి చిన్ని చిన్ని కాళ్ళు, బుల్లి బుల్లి రెక్కలు వచ్చాయి. కళ్ళు చురుకుగా మెరుస్తూ ఉన్నాయి. తల్లి కోడి రెక్కల కింద వెచ్చగా పడుకుంది. ఈకలు సందులలో నుంచి వెలుతురు చూస్తూ ఉంది. రెక్కలలో నుండి బయటకు రావాలి అనిపించింది. "ఆహా! ఈ ప్రపంచం ఎంత అద్భుతంగా ఉంది. ఈ అద్భుతంలో పుట్టిన నేను చాలా అదృష్టవంతురాలను. బయటకు వెళ్లి ఆరుబయట ఆడుకోవాలి" అనుకుని తన కోరికను తల్లితో చెప్పింది."వద్దు వద్దమ్మా! నీవు అప్పుడే బయటకు వెళ్లకూడదు. బయట మన శత్రువులు పిల్లి, కుక్క, గ్రద్ద, కాకి ఉంటాయి. అవి నిన్ను తింటాయి" అని చెప్పింది తల్లి కోడి. అప్పటికి తన కోరిక అణుచుకుంది. కానీ, ఆ కోరికను చంపుకోలేకపోయింది.ఒకరోజు గడిచింది. అమ్మ ఆదమరిచి నిద్రపోతుంది. కోడిపిల్ల మేల్కొంది. మెల్లిగా బయటకు వచ్చింది. ఎదురుగా బల్లిని చూసింది. అది కోడిపిల్ల అలికిడి పారిపోయింది. ఆ తరువాత చీమల బారు చూసింది. వాటిపనిలో అవి ఉన్నాయి. పక్కనే ఉన్న దిబ్బలోకి వెళ్ళింది. కాళ్లతో చెలిగింది. చిన్న పురుగును పట్టుకుంది. ముక్కుతో పొడిచి ముక్కలు ముక్కలు చేసింది. కడుపునిండా తిన్నది. అమ్మ దగ్గరికి పోవటానికి సిద్ధపడింది.అప్పుడే ఆకాశంలో ఎక్కడో ఉన్న గ్రద్ద రయ్యినా కిందకు దిగింది. కోడిపిల్లను కాళ్ళ సందులో పెట్టుకో బోయింది. అలికిడి తల్లికోడి మేల్కొంది. ఒక్క ఉదుటున కాళ్లతో తన్నింది. గ్రద్ద పారిపోయింది. కోడిపిల్ల భయంభయంగా తల్లి ఒడిలోకి చేరింది. "చూసావా తల్లీ! పెద్ద ప్రమాదం తప్పింది. నేను చూడకుంటే ఈ పాటికి గ్రద్దకు ఆహారం అయ్యేదానవు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకు" అంది తల్లికోడి."సరేనమ్మా!" అంది కోడిపిల్ల.నీతి: పెద్దల మాట సద్ధి అన్నం మూట.
కోడిపిల్ల కోరిక (బుజ్జిపిల్లలకు బుజ్జిబుజ్జికథలు): ౼ దార్ల బుజ్జిబాబు.