బంటుమిల్లి.:-వసుధారాణి.

 ప్రొద్దుటూరును వదిలిపెట్టేటప్పుడు మొదటి సారిగా నాకు వదిలిపెట్టటంలో ఉన్న నొప్పి ఏమిటో తెలిసింది. ముఖ్యంగా మేము అందరం ఆనందంగా కలిసి ఉన్న ఇంటిని వదలాలంటే ఏదో బాధ కనిగిరిలో సొంత ఇళ్లను వదిలేటప్పుడు  కూడా అంత అనిపించలేదు.అటెండర్లు,అక్కడ కొద్దిసమయానికే గాఢమైన స్నేహాన్ని ఏర్పరుచుకున్న మిత్రులు కన్నీటి తో మాకు వీడ్కోలు ఇచ్చిన దృశ్యం ఇంకా నాకు గుర్తువుంది.
బంటుమిల్లి దాదాపు 550 కిలో మీటర్ల దూరం ప్రొద్దుటూరుకు .అసలా ఊరి పేరు అందరం అదే మొదటి సారి వినటం.మా అన్నయ్యగారి phd అయిపోవడంతో మా ఆడపడుచు వాళ్ళు నెల్లూరుకు,మేము బంటుమిల్లికి ఎవరి సామాన్ల లారీ వాళ్ళది సర్దించుకుని బయలుదేరాం.నాకన్నా మా ఆడపడుచు చాలా ఎమోషనల్ గా ఉన్నారు పాపం ఆటైమ్ లో మా పిల్లలు ఇద్దరుకూడా ముఖ్యంగా మా గోపాల్ ఆమెకు అలవాటై పోయి వాళ్ళని వదలడం ఆమెకి కష్టం ఐపోయింది.
నెల్లూరు నుంచి సర్కార్ ఎక్స్ ప్రెస్ ఎక్కి గుడివాడలో దిగితే అక్కడికి చిన్నకారు అనబడే అంబాసిడర్ కారు వచ్చింది .పిల్లలు ,నేను ,మా అత్తగారు , (మాజడ్జ్ ముందుగానే వెళ్లి జాయిన్ అయివున్నారు.) మమ్మల్ని తీసుకు వెళ్ళటానికి వచ్చిన అటెండర్ అందరం చిన్నకారెక్కి గుడివాడనుంచి ముదినేపల్లి మీదుగా బంటుమిల్లి వెళుతుంటే అప్పటిదాకా ప్రొద్దుటూరును వదిలిపెట్టి వెళుతున్న విచారం వరిచేలు, కొబ్బరిచెట్లు, పంటకాలువలు,వీటిలో ఎక్కడికి పోయిందో.పచ్చదనం నా మనసులో దిగులునంతా  ఆ ఒక్క ప్రయాణంతో తీసేసింది.పొలాల పచ్చదనం, అందం నాకు కొత్తేమీ కాకపోయినా ఇలాంటి పెయింటింగ్ లాంటి దృశ్యాలు నాకు అప్పటి వరకూ అనుభవంలో లేవు.
అక్కడ కూడా క్వార్టర్ లేక పోవటంతో ఒక ఇల్లు అద్దెకి తీసి ఉంచారు.ఆ ఇల్లు ఆఊరి మొత్తానికి ఎంత ప్రఖ్యాతి అంటే మద్రాసోళ్ల బంగాళా అనేవాళ్ళు. ఆ యింటి ఓనర్ ఒక ప్రొఫెసర్ తమిళనాడులో ఉండి రిటైర్ అయ్యాక  తిరిగి సొంతవూరిలో ఇల్లు కట్టుకున్నాడు.వృత్తకారంలోని డూప్లెక్స్ ఇల్లు చాలా పెద్దగా ఉండేది మెట్లు పైన మూసేసి ఓనర్స్ పైన ఉండేవారు  (వాళ్ళకి బయటినుంచి మెట్లు ఉండేవి)కింద మేము. ఇంటి ముందు పూల మొక్కలు,బోలెడు స్థలం మేము షటిల్ ఆడుకునే వాళ్ళం. వెనుక వైపు ఇంటి కాంపౌండ్ అనుకునే కనుచూపు మేరా వరి పొలాలు.డైనింగ్ హాల్ చుట్టూ పెద్ద  ఫ్రెంచ్ కిటికీలు ఆకుపచ్చని  పొలాల మీద బంగారు సూర్యోదయాలు చూస్తూ కాఫీ తాగటం ఆ యింటిలో నాకు నచ్చిన అనుభూతి. 
పూనా నుంచి వచ్చిన మా పెద్దదపడుచు విజయక్కా,పిల్లలు ఎంత ఆనందపడ్డారో ఆ ఇంటిని, వాతావరణాన్ని చూసి .
మా గోపాల్ మొదట బడికి వెళ్ళింది ఆవూరులోనే కొమ్మారెడ్డి పబ్లిక్ స్కూల్.అచ్చమైన పల్లెటూరి ఇంగ్లీష్ కాన్వెంట్.చదువు బాగా వచ్చింది మాపిల్లలకి.
చెరువు ఒడ్డున ఒక అందమైన సువర్చలాసమేత ఆంజనేయ స్వామి గుడి ఉండేది.ప్రతి శనివారం అప్పాలకోసం,బాదం పప్పుల కోసం ఆగుడికి యమా భక్తిగా వెళ్ళేవాళ్ళం.గుళ్ళో బోలెడు బాదం చెట్లు ఉండేవి పూజారి గారి నాన్నగారు మా పిల్లల కోసం పప్పులు కొట్టి ఉంచి వెళ్ళగానే పెట్టేవారు.పిల్లలతో పాటు నేను పిల్లని అనుకునే వారేమో నాకూ ఓ గుప్పెడు పెట్టేవారు.మా జడ్జ్ గారికి మాత్రం పెట్టేవారు కారు అదేంటో పాపం.
మీనాక్షి అని ఒక ఇంట్లొపని చేసే అటెండర్(మాషాల్ జీ అంటారు ఆపోస్టును )ఉండేది..రాంబాబు,నారాయణ అని ఇద్దరు అటెండర్లు ఉండేవాళ్ళు.జడ్జ్ గారు ఊళ్ళోనే ఉండాలి తప్పనిసరిగా ,వాళ్ళు మాత్రం హాయిగా మచిలీపట్నంలో ఉండేవాళ్ళు .పొద్దున్నే డ్యూటికి వచ్చేటప్పుడు తాజా కూరలు,బందరు మిఠాయిలు తెచ్చేవాళ్ళు.మేము పల్లెటూరి వాళ్ళం లాగా వాళ్ళు పట్నం వాళ్ళలాగా బందరు కబుర్లు చెపుతుండేవాళ్ళు.రాంబాబుకు పిల్లలు అంటే భలే ఇష్టం .ఆరడుగుల ఎత్తు దృఢమైన మనిషి పెద్దవాడే రిటైర్మెంటుకి దగ్గరగా వచ్చిన వాడుకానీ  మా పిల్లలతో భలే ఆడుకునే వాడు. వాళ్ళని చాలా జాగర్తగా చూసుకునే వాడు . నారాయణ,మీనాక్షి బాగా కబుర్లు చెప్పే రకాలు నేను తక్కువ మాట్లాడతానని మా అత్తగారి దగ్గర చేరి ముచ్చట్లు చెప్పేవాళ్ళు. మన ఊరు కానప్పుడు మరి వాళ్లేగా మాకు ఆత్మీయులు.
ఐతే ఆ ఇంట్లో ఒక లాంటి విచారం ఆవురించి ఉండేది. ఎప్పుడంటే అప్పుడు పైనుంచి సన్నసన్నగా,ఒక్కోసారి పెద్దగా ఏడుపు వినిపిస్తూ ఉండేది.ఆడమనిషి గొంతుకే  ఇంట్లో ఉండేది ఓనర్ ,ఆయన భార్య,పాతికేళ్ల కొడుకు.నాకు అర్ధం అయ్యేది కాదు .ఓనర్ గారి భార్య కిందకు వచ్చినప్పుడు పిల్లల్ని బాగా పలరించేది, నన్ను కూడా అమ్మా అంటూ పిలిచేది ఏమైనా కావాలా ?అని అడిగేది ఇంట్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అని విచారించేది. సంతోషంగానే కనపడేది .మరి ఆ ఏడుపు కథ ఏమిటో తెలిసేది కాదు.
పిల్లలతో ఆడుతూ ,పాడుతూ, కొత్తఊరుని,ప్రకృతిని ఎంత ఎంజాయ్ చేస్తూనే వున్నా ఈ ఏడుపు నన్ను కొంచె కలవరపరుస్తూ ఉండేది.ఒకసారి మా ఓనర్ ఆంటీ అక్కయ్య ఒకామె వాళ్ళ ఊరినుంచి వచ్చారు.ఆవిడ రాగానే ఈవిడ నన్ను బయటికి పిలిచి చూపించి నేను చెప్పలా మన మబ్బమ్మ లాగానే అని చెప్పటం, ఆవిడ నన్ను చూసి కనీసం మిగతా విషయయాలు ఏమీ మాట్లాడకుండా, అవునే విజయా "మన మబ్బమ్మ" అనుకుంటూ ఆవు చుట్టూ ప్రదక్షణము చేసే భక్తురాలిలా నాచుట్టూ తిరిగి చూసింది. ఆతర్వాత  ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ పైకి వెళ్లి పోయారు.
                     (సశేషం)