దివి కేగిన ' దింపు'..!!: -____కె.ఎల్వీ-హనంకొండ.

 దింపడం 
తెలుసుగానీ ..
దింపు ఏమిటీ ?
కాంక్రీటు ...
కీకారణ్యంలో ,
బ్రతుకువెళ్లదీస్తున్న ,
ఒక ఆధునికుడి ..
వింత ప్రశ్న ...!
వినడానికి ...
వింతశబ్ధం అయినా ,
మారిన _
జీవన విధానంలో ,
పరిసరాల ప్రబావం ,
ప్రభావితం చేస్తున్న ,
ఆధునికత ...
అమూల్యమయిన ,
పదాలు కొన్నింటిని ,
కాలగర్బంలో 
కలిపేశాం ...!
కొన్ని పదాలు మాత్రం ,
అవసరాన్ని బట్టి ,
పల్లెల్లో ఇంకా 
పదిలంగానే ఉన్నాయ్  ,
మరి _ అలాంటిదే ,
' దింపు ' అనే పదం !
ముదిరిన _
కొబ్బరికాయలను ,
చెట్టు ఎక్కి కోసి ,
నేలమీదకు దించడమే ,
'  దింపు  '....!
దింపులో __
చెట్టు ఎక్కడం ,
ఒక కళ ...
ఆ ..కళాకారులే ,
దింపు కార్మికులు ,
పొట్టకూటికొసం ,
ప్రాణాలకు తెగించే 
సాహసికులు ...!
పిరుదుల పై 
బల్ల ....
దానికి _
అనుసంధానమై ,
వీపును _చెట్టును ,
కలిపి ఉంచే ' మోకు '
కాళ్లకు బంధం ,
చెట్టు పొడుగు 
ఎంతయినా _
సునాయసంగా ,
గమ్యం చేరుకొనే 
ప్రావీణ్యం ,,
నాణ్యత గ్రహించి ,
కాయలు కోసి ...
నేలకు విసరడం ,
చూడ్డానికే ...
వళ్ళు ఝల్లుమనే 
సన్నివేశం....!
కాలం మారి _
సుఖపడే మార్గాలు 
అందుబాటులోకి ..
వచ్చాశాయి __
దింపుతీత కార్మికులు 
కరువైపోయారు ,
ప్రత్యామ్నాయానికి 
దారులు ...
వెతుకుతున్నారు 
రై   తు   లు.....!
ఒక చరిత్ర గా_
మిగిలి పోనున్ది ' దింపు '!!
        _