ఉత్తమ స్నేహితులు (కథ) : --సరికొండ శ్రీనివాసరాజు


 ఆ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులు తమ పిల్లలకు ఒక ప్రశ్న ఇచ్చి సమాధానం రాయమన్నారు. అది "మీకు ఉత్తమ స్నేహితులు ఎవరు? ఎందుకు?" అని. చాలామంది చాలా రకాలుగా సమాధానాలు రాసినవారు. రజిత అనే విద్యార్థిని తన బెస్ట్ ఫ్రెండ్ అలివేలు అని తనకు ఏ అవసరం వచ్చినా సహాయం చేస్తుందని వివరంగా రాసింది. సునీత అనే విద్యార్థిని తన బెస్ట్ ఫ్రెండ్ వాణి అని, వాణీ ఎప్పుడూ తనతో పాటు సునీతను కూర్చోబెట్టుకుని చదివిస్తుంది అని, సునీతకు ఏ అనుమానం వచ్చినా వాణీ నివృత్తి చేస్తుందని రాసింది. నితీశ్ అనే విద్యార్థి తన బెస్ట్ ఫ్రెండ్ వేంకటేశు అని ఎందుకంటే తాను ఏ సినిమా చూసినా తనకే స్టోరీ చెబుతాడని రాసినాడు. సిరి అనే విద్యార్థిని తన బెస్ట్ ఫ్రెండ్ లలిత అని, తాము తమ తల్లిదండ్రులు  ప్రతిరోజూ విరామ సమయంలో తినడానికి ఇస్తున్న ఆరోగ్యకరమైనవి పండ్లు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకేమి ఇచ్చినా పంచుకొని తింటారని చెప్పింది. స్రవంతి అనే విద్యార్థిని తన బెస్ట్ ఫ్రెండ్ శ్రావణి అని, శ్రావణి ఎప్పుడూ తనతోనే ఆడుకుంటుందని రాసింది. శ్రీనివాసు అనే విద్యార్థి తన బెస్ట్ ఫ్రెండ్ చెట్లే అని, తాను తన ఇంట్లో ఎన్నో రకాల చెట్లను పెంచుతున్నాను అని, ఆ చెట్ల పుణ్యమా అని రకరకాల పక్షులు కూడా ప్రతిరోజూ వచ్చి తనను పలకరిస్తున్నాయని చెప్పాడు. అంతే కాకుండా తాను తిన్న పండ్ల విత్తనాలను బయట ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా వేస్తున్నానని, అవి కొన్ని మంచి చెట్లు అయినాయని రాసినాడు. రామకృష్ణ అనే విద్యార్థి తన బెస్ట్ ఫ్రెండ్ మంచి పుస్తకం అని చిన్నప్పటి నుంచి తాను రకరకాల కథల పుస్తకాలు, విజ్ఞాన గ్రంథాలను చదువుతున్నానని, అవి తన సత్ప్రవర్తనకు దోహదం చేస్తున్నాయని రాసినాడు. ఇలా రకరకాలుగా రాసినారు. 


       అప్పుడు తెలుగు ఉపాధ్యాయులు ఇలా అన్నారు. కొంతమంది సమాధానాలు సరిగా లేకున్నా చాలామంది సమాధానాలు నాకు తృప్తిని ఇచ్చాయి.  అయితే ప్రతి ఒక్కరికీ శ్రమ అనేది బెస్ట్ ఫ్రెండ్ కావాలని, ఈ వయసులో కష్టపడి చదవడం, ఆరోగ్యం కోసం కష్టపడి వ్యాయామం చేయడం, ఎప్పుడూ శ్రమించి పని చేయడం చేయాలని శ్రమజీవి లోకానికి రాజు అని తెలిపారు. ఉదాహరణకు రైతు నిరంతరం శ్రమించడం వల్లనే, సైనికులు శ్రమించి దేశాన్ని రక్షిస్తూ ఉండటం వల్లనే మనం క్షేమంగా ఉన్నామని తెలుగు ఉపాధ్యాయులు కృష్ణమాచార్యులు గారు వివరించారు. చప్పట్లు కొట్టారు అందరూ.