జింక అందం. (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

         అది ఒక దట్టమైన అడవి. 
       అందులో ఒక జింక ఉంది. 
       అది చాలా అందంగా ఉంటుంది. 
       ఒక రోజు దానికి దాహం అయింది. 
       సెలయేరు వద్దకు వెళ్ళి దప్పిక తీర్చుకుంది. 
       సెలయేటి నీటిలో తన ప్రతిబింబం చూసుకుంది. 
       తన అందానికి తానే ఆశ్చర్య పోయింది.
       అందమైన కళ్పు, వంకులు తిరిగిన కొమ్ములు చూసుకుని మురిసి పోయింది. 
       అయితే తన కాళ్ళను చూసుకుని చింతించింది.
       "భగవంతుడు భలే గమత్తులు చేస్తుంటాడు. నాకు ఎంతో అందాన్ని ఇచ్చాడు. కాళ్ళు మాత్రం సన్నగా, కాడల్లా ఉన్నాయి. నా అందానికి ఈర్ష్య పడి కాబోలు ఇలాంటి కాళ్ళను సృష్టించాడు" అనుకుంది.
       ఒక రోజు వచ్చిక బయళ్ళలో మేస్తూ ఉంది. 
       ఒక పులి చూసి వెంట పడింది. 
       జింక వేగంగా పరిగెత్తింది. 
       పులి అందుకోలేక పోయింది. 
       ఇలా పులి బారి నుంచి తప్పించుకుంది. 
       సన్నగా, కాడల్లా, అంద విహీనంగా ఉన్న కాళ్లే తనను రక్షించేయని జింక గ్రహించింది. 
       అయినా వంకులు తిరిగిన కొమ్ముల్ని చూసుకుని మురిసి పోవటం మాత్రం మానలేదు.
       ఆ కొమ్ములే తనకు  ప్రత్యేకత కలిగించాయని దాని నమ్మకం.
       మరొక రోజు మళ్ళీ పులి వెంట పడింది. 
       జింక వేగంగా పరిగెత్తింది.
       పులి తన బలానంతా ఉపయోగించింది. 
       జింకను ఎలాగైనా చంపి తినాలని దాని పట్టుదల. 
       జింక ప్రాణ భయంతో పరుగు తీస్తుంది. 
       పులికి  ఏమాత్రం అందే అవకాశమే లేదు. 
       తన కాడాల లాంటి కళ్ళే తనను కాపాడే ప్రాణదాతలు కదా? 
       ఇలా పరుగు పెడుతూ ఉండగా, గుబురు పొదలు అడ్డం వచ్చాయి.
       అందు లోకి దూరింది. 
       ఇక ఎటు వెళ్ళాలన్నా దారి లేదు. 
       రెండు చెట్లు పక్కపక్కనే ఉన్నాయి. 
       వాటి సందులో దూరితే  తప్పించుకోవచ్చు.
       వెనుకా ముందు చూడకుండా దూరింది.
       దాని వంకులు తిరిగిన కొమ్ములు అడ్డం వచ్చాయి. 
       ఆ కొమ్ములే లేకుంటే సులభంగా దూరి చిటికెలో తప్పించుకునేది. 
       ఇంతలో పులి రానే వచ్చింది.
       మీద పడనే పడింది.
       నీతి : అందమైన కొమ్ముల కన్నా కాడల్లాంటి కళ్లే మేలు.