ఎలుక గర్వం (బుజ్జిపిల్లలకు బుజ్జిబుజ్జికథలు):- ౼ దార్ల బుజ్జిబాబు

 ఒక అడివిలో చాలా ఎలుకలు ఉండేవి. వాటికి ఆహారం దొరకటం కష్టం అయింది. అందువల్ల బక్కచిక్కి బలహీనమయ్యాయి. దీనికి కారణం ఒక పిల్లి. ఆ పిల్లి  విచ్చలవిడిగా వేటాడేది. అందిన ఎలుకను అందినట్టు మింగేసేది. దీనితో ఎలుకలు కలుగులో. నుంచి బయటకు రావడమే మానేశాయి. ఆహారం దొరకక ప్రతిరోజు పస్తులతో  గడిపేవి.
      ఇది ఇలా ఉండగా ఎక్కడి నుండో ఒక బలిసిన ఎలుక వచ్చింది. దానికి గర్వం ఎక్కువ. వచ్చిరాగానే ఎలుకలన్నిటిని సమావేశ పరిచింది. తనని నాయకునిగా నియమిస్తే పిల్లి పీడ విరగడ చేస్తానని చెప్పింది. ఎలుకలు అందుకు అంగీకరించాయి. బలిసిన ఎలుకను నాయకునిగా ఎన్నుకున్నాయి. దానికి ఇంకా గర్వం  పెరిగింది.
          ఒక రోజు పిల్లి ఆదమరిచి నిద్ర పోతుంది. కుంభకర్ణుడిలా గుర్రుపెడుతుంది. ఇదే అదును అనుకుంది. ఒక్క అంగలో పిల్లిని చేరింది. మెడలో గంట కట్టింది. చెంగునా కలుగులో దూరింది. పిల్లి మేల్కొని కళ్ళు నులుపుకుంది. మెడలో గంటను చూసుకుంది. ఎంత లాకున్నా, పీకున్నా గంట ఊడి రాలేదు. దీనితో పిల్లికి కష్టాలు వచ్చి పడ్డాయి. ఎలుకలు మాత్రం ఇష్టం వచ్చినట్లు తిరగ సాగాయి. పిల్లి వస్తుంటే మాత్రం గంట శబ్దానికి రంద్రంలో  దూరేవి. ఇలా ఎలుకలు బాగా తిని సుఖంగా ఉండటం మొదలు పెట్టాయి.
      మెడలో గంటను కట్టిన ఎలుకకు గర్వం  ఇంకా బాగా పెరిగింది. ప్రత్యేకంగా  గుర్తింపబడాలని అనుకుని, " మిత్రులారా! మీ అందరి కోరికపై  పిల్లి మెడలో గంట కట్టాను. నన్ను నాయకునిగా చేయండి" అని అడిగింది. వెంటనే ఎలుకలన్నీ దానికి కిరీటం పెట్టాయి. వంటి నిండా నగలు తొడిగాయి. నగలన్నీ అలంకరించిన బలిసిన ఎలుక నగల బరువుతో ఇంకా లావయ్యింది. తనను తాను చూసుకుని మురిసిపోయింది.
         ఇంతలో గనగణమంటూ పిల్లి వచ్చింది. ఎలుకలు పరుగెత్తి కన్నాలలో దురాయి.  బలిసిన ఎలుకకు ఆభరణాలు బరువయ్యాయి.పరుగెత్తలేక పోయింది. దొరికిన కలుగులో దూరబోయింది. కిరీటం అడ్డు వచ్చి దూరలేక పోయింది. పిల్లి రానే వచ్చింది.  కాలు వేయని వేసింది. ఆ పూట  పిల్లికి ఆహారం అయింది  నాయకుడి ఎలుక. 
నీతి: గర్వపడితే పతనం తప్పదు.