కోతిదొంగతనం: -డి.కె.చదువులబాబు.ప్రొద్దుటూరు.


 చంపక అరణ్యంలో ఓకోతి ఉండేది. అది అప్పుడప్పుడూ పొరుగున ఉన్న పల్లెకు వెళ్తుండేది.

ఒకసారి ఒక అత్తరు వ్యాపారి అత్తరు పూసుకోవడం కిటికీనుండి చూసింది. అత్తరు వాసన గుప్పుమని వ్యాపించింది.

ఆ సువాసనకు కోతి మైమరచి పోయింది. వ్యాపారి అత్తరు సీసాను బల్లపై ఉంచి, లోపలి గదిలోకెళ్ళాడు. కోతి అటూ ఇటూ చూసి,ఎవరూ లేరని నిర్ణయించుకుంది. మెల్లిగా ఇంట్లో కెళ్లింది. అలాంటి సీసాలు గూటి నిండా పేర్చి ఉన్నాయి. ఒక సీసాను తీసుకుని అడవికి చేరుకుంది. అత్తరును ఒళ్ళంతటా పూసుకుంది. అడవిలో అటూఇటూ తిరిగింది. ఆసువాసనకు ఆకర్శించబడిన కొన్ని జంతువులు ఆశ్చర్యంగా కోతి చుట్టూ చేరాయి. "నీవు మా మంచి మిత్రుడివి కదా! ఈవాసన అద్భుతంగా ఉంది. మాకూ తెచ్చిస్తే ప్రతిఫలంగా నీవు కోరిన ఆహారం తెచ్చిస్తాం" అన్నాయి.

తనకు లభించిన గుర్తింపుకు కోతి పొంగిపోయింది.

ఉదయమే పల్లెకెళ్ళింది. అత్తరు వ్యాపారి ఇంటి దగ్గర కాపుకాసింది. వ్యాపారి కొన్నిసీసాలు సంచిలో పెట్టుకుని అమ్మకానికి వెళ్లిపోయాడు.ఆయన భార్య బయట గదిలో లేని సమయం చూసి, చడీచప్పుడు కాకుండా లోనికెళ్ళింది. గూటిలో ఉన్న రెండుసీసాలు తీసుకుని అడవికొచ్చింది. కోతికోసం ఎదురుచూస్తున్న నక్క, జింక, చిలుక,పంది దగ్గరకొచ్చాయి. పందికి,నక్కకు అత్తరు సీసాలనిచ్చింది. అవి తెచ్చిన ఆహారాన్ని తీసుకుంది. జింకకు,చిలుకకు రేపటిదినం తెచ్చి ఇస్తాననిచెప్పింది.

ఇదంతా చూస్తున్న కుందేలు "కోతిమిత్రమా! నీవు చేస్తున్న పని మంచిదికాదు."అని హెచ్చరించింది.

"అల్పప్రాణివి నీవు నాకు మిత్రుడివా ?పెద్దపెద్ద జంతువులు నాస్నేహం కోసం ఎదురుచూస్తున్నాయి."అంటూ ఎగతాళి చేసింది కోతి.

కుందేలు మాటలను కోతి పెడచెవిన పెట్టింది.

అలా రోజూ వెళ్ళి రెండుసీసాలు దొంగిలించుకుని వచ్చి ఇవ్వసాగింది. జంతువులు,పక్షులు తనచుట్టూ చేరి, తనకిచ్చే గుర్తింపుకు గర్వపడసాగింది. రోజూ రెండు సీసాలు మాయమవడం వ్యాపారి గుర్తించాడు.

ఒకరోజు అమ్మకానికి వెళ్ళకుండా అత్తరు సీసాలసంచిని గూటిలో ఉంచాడు.ఇంటి తలుపులు తెరిచి ఉంచాడు. కర్ర పట్టుకుని తలుపు చాటున దాక్కొని, దొంగకోసం ఎదురు చూడసాగాడు. కోతి వచ్చింది.గదిలోకి తొంగి చూసింది. ఎవరూ కనిపించలేదు.చప్పుడు కాకుండా లోపలికెళ్ళింది. అత్తరు సీసాలసంచిని చూసింది.చాలా సంతోషపడింది. ఒకేసారి సంచిని తీసుకెళ్తే రోజూ వచ్చే శ్రమ తప్పుతుందనుకుంది.సంచిని భుజానికి తగిలించుకోబోయింది.వ్యాపారి తలుపు చాటునుండి వచ్చి కర్రతో కొట్టాడు. కాలు విరిగినంతపనయింది.సంచిని వదిలేసి పరుగందుకుంది.

కుంటుకుంటూ అడవిలో కొచ్చిపడింది.అత్తరు సీసాలకోసం తనచుట్టూ చేరిన జంతువులకు జరిగిన సంగతి చెప్పింది.

"అలాగా!"అంటూ అవి వెళ్ళిపోయాయి. కోతి నొప్పితో విలవిలలాడసాగింది. కాలు వాచింది.నడవలేకుండా ఉంది. అత్తరుసీసాలు తీసుకున్న ఏ జంతువూ దాన్ని పట్టించుకోలేదు. ఆహారం తెచ్చివ్వలేదు.కుందేలు కోతి దగ్గరకొచ్చింది. "కోతిమిత్రమా!దొంగతనం తప్పని నేను చెబుతూనే ఉన్నాను. దొంగతనం బయటపడిన రోజు ఫలితం ఇలాగే ఉంటుంది. అవసరంకోసం నీచుట్టూ తిరిగిన జంతువులు ఈరోజు నీవు కష్టంలో ఉంటే సహాయపడటానికి ఒక్కటీ రాలేదు." అని కోతిగాయానికి ఆకుపసరు తెచ్చి రాసింది. గాయం నయమయ్యే వరకూ వైద్యం చేసింది.ఆహారం తెచ్చి ఇచ్చింది.

తాను ఎగతాళి చేసినా మనసులో పెట్టుకోకుండా మంచిని చెప్పి, మంచి మనసుతో ఏమీ ఆశించకుండా సహాయపడిన కుందేలు తనకు నిజమైన మిత్రుడని గుర్తించింది కోతి. తర్వాత ఎప్పుడూ దొంగతనం చేయలేదు.