అడుగు: -రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి

 నువ్వు అడుగులేస్తూ- అలసిపోతూ
నడవలేక నాకై చేతులు చాస్తే
నీ ప్రతి అడుక్కి ఎంత ఆనందించాను
ఎంత సంబరపడ్డాను 
తప్పటడుగుల్తో నీవు పడిపోతే-
జీవితంలో నీవు తప్పటడుగులు వేయరాదని
అడుగు - ..నీ ప్రతి అడుగు
ముందుకు- మునుముందుకు వేయాలని
సూర్యచంద్ర గతుల నీ గతి కలవాలని
వేయలేని అడుగునైనా
స్వర్గం దాకా నడవాలని- దీవించా -..
అడుగడుక్కి-
సుగంధాల నిను ఆపే పూవులుంటాయి
వేడిగాలుల్లా వేధించే వ్యక్తులుంటారు
‌వెన్నెల్లా - తారల్లా దారి చూపే నేస్తులుంటారు
పంచామృతాన్ని తాగిస్తామనే  తోడేళ్ళ రూపాలుంటాయి సత్యం అసత్యమయే వధ్య స్థలాలుంటాయి
నీ పొలికేక వెర్రికేకై వ్యర్థమయే   సందర్భాలుంటాయి
 అని తెలియాలి
నింగిని ఎగిరే పక్షుల్ని చూస్తూ
నింగిని దాగిన అందాల కోసం చూస్తూ
అడుగులేస్తే-
అగాథంలోకి పడ్తుంది నీ అడుగు
నీ తల కిందికి వంచి
మొలకల్ని చూస్తూ ముద్దాడుతూ
మునుముందుకు అడుగేయి
కారణం...
అవి పెరిగి వటవృక్షాలౌతాయి