ఎయిర్ కూలర్.: - వసుధారాణి.

 కనిగిరిలో క్లయింట్లు ఇచ్చే ఫీజులు విచిత్రమైన పద్దతులలో కూడా ఉంటాయి అని  నాకు అర్ధం అవ్వటానికి  ఎండాకాలం వస్తే కానీ తెలియలేదు .మా ఆడపడుచు గిరిజక్కని ,నన్ను మాఅత్తగారు  కొత్త చీరెలు తెచ్చుకోండి అని చెప్పారు. సరే  ఇద్దరం ఊళ్ళో కల రెండు ప్రఖ్యాతి పొందిన చీరల షాపులకు వెళదాం అని మాగిరిజక్క చెప్పారు. రెండు షాప్ లు ఎందుకో నాకు అర్ధం కాలేదు, పెద్దల్ని వినయంగా ఫాలో అవ్వటమే నా తక్షణ కర్తవ్యం కనుక ఆమె వెనకాల మొదట షాప్ కి వెళ్ళాను. నేను ఎంచుకోవటంలో చాలా వేగం అందుకు రెండు చీరలు చాలా తొందరగా సెలక్ట్ చేసుకున్నా.ఆవిడ మాత్రం మొత్తం షాప్ అంతా తిరగేసి ఒకటి సెలెక్ట్ చేసి పక్కన పెట్టు అని ,ఇంకో షాపులోకి తీసుకెళ్లి అక్కడా అంతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు.మొత్తమీద చెరి రెండు చీరలు సెలక్ట్ చేసుకున్నాం.
చీరలకి డబ్బుల బదులు ఆ షొప్ వాళ్లే మాకు ఓ స్లిప్పు ఇచ్చారు. అందులో ఉన్న లెక్క ఏమిటంటే వాళ్ళు వేసిన ప్రామిసరి నోటు దావా తాలూకు ఫీజు లో ఈ చీరల మొత్తం పోగా ఇంకా వాళ్ళు చెల్లించాల్సిన ఫీజు బాకీ.అంటే మళ్ళీ మనం చీరెలు కొనుక్కోవాలి తప్పితే ఫీజు డబ్బు రూపంలో ఉండదు అన్నమాట.నాకు భలే అనిపించింది అందులో ఉన్న వ్యాపారకిటుకు తెలియని చిన్నతనం వలన.
కొన్ని రోజులకి అర్ధం అయ్యింది స్టీల్ సామాన్లు, ఫాన్సీ షొప్,వెచ్చాల అంగడి,ఫర్నిచర్ షాప్,రెడీమేడ్ దుస్తులు ఒకటియేమిటి అన్నిచోట్లా అందరూ క్లయింట్లే అని.డబ్బు అక్కర్లేకుండా కావాల్సిన వస్తువులు తెచ్చుకోవటంలో ఉన్న మజా ఏంటో నేను కనిగిరిలో ఉన్న నాలుగు సంవత్సరాలు అనుభవించాను.ఆఖరికి దీపావళి టపాకాయలతో సహా.
ఎండాకాలంలో ఒక ఒకవిచిత్రం జరిగింది కనిగిరి ఊరు మొత్తానికి మొదటగా ఎయిర్ కూలర్స్ అమ్మటానికి ఒక షాప్ వచ్చింది.మొదటి కూలర్ ఫీజు రూపంలో మా ఇంటికి వచ్చింది.అంతే ఇంక చూదండి ఆకూలర్ ని నీళ్లతో నింపేసుకోవటం కర్టెన్లు అన్ని వేసుకొని చీకటి చేసేసుకోని మధ్యాన్నం అందరం హాల్లో చల్లగా పడుకోవడం.
నాకు ,మా అడపడుచుకు సినిమాల విషయంలో ఒక రకం సినిమాల్లో ఒకే ఇంట్రస్ట్ అని తెలుసుకుని ఇద్దరం తెగ ఆనందపడిపోయి ఆ సమ్మర్ ని రాంగోపాల్ వర్మ సమ్మర్ గా మార్చేసామ్ .అదేనండి .
VCR లో అప్పటి వరకు అన్ని భాషల్లో వచ్చిన హారర్ సినిమాలన్నీ చూసేసాం. ఆ వీడియో లైబ్రరీ అతనూ క్లయింటే ఇంకేముంది , చేతబడి,కాస్మోరా,ఈవిల్ డెడ్,బీస్ సాల్ బాద్, వందవ రోజు,తులసి ఇలా ఉండేది మా లిస్టు.చల్లటి రస్నా, వేరుశనగ క్కాయలు (అవీ పల్లెటూరి క్లయింట్ల ఫీజు),బెల్లముక్క,మా సినిమాల స్నాక్స్.
పూసల పూసల వెన్నకాచిన నెయ్యి, గోంగూర,పండుమిరపకాయలు,చింతపండు, సంక్రాంతి సీజన్లో నేతి అరిసెలు ,చిక్కుడుకాయలు,గుమ్మడికాయలు ఇలాంటి ఫీజులు కూడా వచ్చేవి పల్లెల క్లయింట్ల నుంచి.