ఏకపది:(శనివారం)*******
వారానికి చివరకొచ్చామనే_సంతోషం ఇస్తుంది.
ద్విపదం:(ఆదివారం)
********
తలుచుకొంటేనే ఆనందం కల్గించే సెలవుదినం.
సరదాల,సంతోషాల వారం.
త్రిపదం:(సోమవారం)
*******
కర్తవ్యాలు తిరిగి మొదలయ్యే రోజు.
బద్ధకాన్ని బద్ధలు కొట్టి లాక్కెళ్ళే వారం.
కొత్త ప్రారంభానికి నాందీ ప్రస్తావన చేసే దినం.
లఘుకవిత:(జీవితం)
**********
మార్గాల ముళ్ళకంపలపై నడిపించి
అనుభవాల హారాలు వేస్తుంది.
కష్టసుఖాల కావడికుండలను భుజాలపై మోయించి,
రాటుదేలుస్తుంది.
బంధాల,అనుబంధాల పాశాల్లో
బంధించి,బతుకు రుచి చూపిస్తుంది.
స్నేహాల,కర్తవ్యాల కాంతుల్లో
ప్రకాశింపజేస్తుంది.
అన్ని రసాల ఆస్వాదన చేయించి,మాయం చేస్తుంది.
వచనకవిత:
***********
(కొత్త బంగారు లోకం)
ప్రజలే పాలకులై దేశాన్ని నడిపించాలి.
పాడిపంటలతో సౌభాగ్యం వెల్లివిరిసి సుఖమయ జీవనం కలగాలి.
శాంతి,సౌభ్రాతృత్వాలతో ఏకమైన స్వచ్ఛత పరిఢవిల్లాలి.
ధర్మమే మహోన్నతంగా నాలుగుపాదాలా నడవాలి.
శ్రమశక్తితో అందరూ చక్కగా పనులు చేసుకోవాలి.
అభివృద్ధి,సంక్షేమాలు తోడునీడలై కనబడాలి.
పేదరికమన్న మాట తొలిగి గౌరవప్రద జీవనాలుండాలి.
శత్రుత్వాలు లేని నియంత్రణ రేఖలతో అందరొక్కటవ్వాలి.
విద్య,వైద్యాలు అందరికీ అందుబాటులో ఉండి ఆనందించాలి.
కులమతాల అడ్డుగోడలు లేని
సమసమాజం ఏర్పడాలి.
ఆరోగ్యం,ఆనందం,ఆధ్యాత్మికం
ఆహ్లాదాలు ఎల్లప్పుడూ నిలిచే
కొత్తబంగారు లోకం రావాలి.
నానీ:(సెలవు)
*****
దేనికి నిర్దేశింపబడ్డా
ఉత్సాహం.
అనేక పనులకు
శ్రీకారం.
కవనపవనాలు:-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.