ఎందుకలా కొడుతున్నారు: -- యామిజాల జగదీశ్
 నాకు తెలిసిన ఓ ఉపాధ్యాయుడు చెప్పిన విషయమిది. ఆయన పని చేసిన స్కూలు హెడ్మాస్టర్ ఒకరి మంచితనాన్నిలా గుర్తు చేశారొకసారి.
ఓరోజు గ్రౌండులో ఆడించిన తర్వాత పిల్లలను ఓ వరుసలో నడిపించి క్లాసులోకి తీసుకుపోతుండగా ఓ ఇద్దరు పిల్లలు వరుసలో నించి ఇవతలకొచ్చి పరిగెట్టుకుంటూ క్లాసులోకెళ్ళారు. 
ఇది గమనించిన డ్రిల్ మాస్టర్ ఆ ఇద్దరు విద్యార్థులనూ పిలిచి తన దగ్గరున్న బెత్తంతో కొడుతూ తిట్టడం మొదలుపెట్టారు. 
అది చూసిన హెడ్మాస్టర్ డ్రిల్ మాస్టరుతో "కొట్టడం ఆపండి. ఎండ వేడిలో చెప్పుల్లేకుండా నడవలేక ఆ కుర్రాళ్ళిద్దరూ క్లాసులోకి పరుగెత్తారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోక వారిద్దరినీ కొట్టడం ఏమన్నా బాగుందా? మనం చెప్పుల్లేకుండా ఈ ఎండలో నడవగలమా? ఈ విషయం గ్రహించకపోవడం మీ తప్పు. ఈరోజు సాయంత్రంలోపు మన స్కూల్లో ఎంత మంది విద్యార్థులకు చెప్పుల్లేవో తెలుసుకుని వారి పేర్లు రాసివ్వండి" అని ఆదేశించారు.
డ్రిల్ మాస్టర్ ఆ రోజు సాయంత్రం చెప్పులు లేని వారి జాబితా ఇవ్వగా వారందరికీ హెడ్మాస్టర్ వారందరికీ ఒకట్రెండు రోజుల్లో సొంత డబ్బులతో చెప్పులు కొనిచ్చారట.