దున్న దురాలోచన (బుజ్జిపిల్లలకు బుజ్జికథ)౼ దార్ల బుజ్జిబాబు

        ఒక ఊరిలో ఓ రైతు ఉండేవాడు.
       అతడి వద్ద పెంపుడు జంతువులు ఉండేవి. 
       అవి కుక్క, పిల్లి, కోడి, గెద, దున్న. 
       అవి ఎంతో స్నహంగా, కలిసి కట్టుగా ఉండేవి. 
       గెద పాలు ఇచ్చేది . 
       దున్న దుక్కి దున్నేది. 
       బండి లాగేది. 
       వీటి ద్వారానే రైతుకు రాబడి వచ్చేది. 
       పోషణ జరిగేది.
       ఒకరోజు దున్నకు దురాలోచన కలిగింది. 
       తాను కష్టపడుతూ ఉంటే తోటి జంతువులు కూర్చొని తినటం దానికి ఈర్ష్య కలిగించింది. 
       తన వల్ల తన భార్య గేద వల్లనే  రైతు బతుకు తున్నాడని గ్రహించింది. 
       కుక్కకు ముప్పొద్దుల ఆహారం వేయడం, పిల్లికి పెరుగన్నం పెట్టడం, కోడికి గింజలు చల్లడం
దున్న సహించలేక పోయింది.  
       వడలువంచి పనిచేసే తనకు  పాలిచ్చే గెదకు  మాత్రం పిడికెడు ఎండుగడ్డి వేయడం  అవమానంగా భావించుకుంది. 
       అసూయతో  రగిలి పోయింది. 
       రైతుకు గుణపాఠం నేర్పాలి అనుకుంది .
       అదే విషయం గెదతో  చెప్పింది. 
       అప్పటి నుంచి గెద పాలు ఇవ్వడం మానుకుంది. 
       దున్న దున్నడం, బండి లాగడం మానేసింది. 
       ఇంకేముంది రైతుకు కష్టాలు వచ్చి పడ్డాయి. 
       కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు. 
       ఇల్లు గడవడం గగనం అయింది. 
       చేతిలో చిల్లి గవ్వ లేదు.  
       చికాకులో పడ్డాడు. 
       ఇన్నీ కష్టాలకు కారణమైన దున్న, గెదను చావగొడుతున్నాడు. 
       వాటికీ మేత  వేయటం మానుకున్నాడు. 
       జంతువులన్నీ ఆకలితో అల్లాడి పోయాయి. 
       కుక్క, కోడి, పిల్లిని కూడా పట్టించు కోవడం మానేశాడు.
       దెబ్బలు తిని మూలుగుతుంది దున్న. 
       అప్పుడే కోడి వచ్చింది. 
       "దున్న అన్నా! నిన్ను చూస్తుంటే నా కళ్ళు కాలువలవుతున్నాయి. ఎందుకు యాజమాని చేతిలో  దెబ్బలు తింటావు. మనం పుట్టింది మనుష్యులకు సేవ చేయుటం కోసం. వారు విసిరేసిన మెతుకులు తింటాము. కుక్క విశ్వాసంగా కాపలా కాస్తుంది. పిల్లి ధాన్యాన్ని ఎలుకల బారినుంచి  కాపాడుతుంది. నేను గుడ్లు పెడుతాను. నా బిడ్డలను మాంసానికి ఇస్తాను. నీ భార్య పాలు ఇస్తుంది. నీవు దుక్కి దున్ని బండి లాగుతావు . ఇలా మనందరం  మనకు తోచిన విధంగా పని చేస్తూ ఇంటిని నడుపుతున్నాం. మనం ఒకరి మీద ఒకరం ఆధారపడి ఉన్నాం. ఎవరి పనిని వారు చేస్తేనే చక్రం తిరిగేది. ఎవరు పని మానినా అందరికి కొరతే.
నా మాట విను. అలక మానుకో..." అంది కోడి.
       దున్న తప్పు తెలుసుకుంది. 
       పని చేయటం మొదలు పెట్టింది. 
       రైతు కష్టాలు గట్టేక్కాయి. 
       అన్నీ సుఖంగా ఉన్నాయి. 
  నీతి : అసూయ వద్దు. ఎవరి పనిని వారు చేసుకుంటేనే  అందరికి సుఖం.