నాతో ..నా ..కలం ...!!:--ఝాన్సీ.కొప్పిశెట్టి ఆష్ట్రేలియా .

 ఏయ్.......నిన్నే......
నీ చేతిలో కలాన్ని
చిక్కాను కదా చేతిలో అని గీకేయటమేనా
పొట్టలో ఇంకుంది కదా అని కక్కేయటమేనా
ఇంకుంటే నాలోనే ఇంకనీ
తగుదునమ్మా అని కక్కావో.....జాగ్రత్త.
ఏమైనా రాసేయొచ్చనేగా నీ ధీమా
వారించలేననేగా నీ భరోసా
రక్తి నా మీదే...భక్తి నా మీదే అంటావు
నా నిబ్బు నుండే ఊపిరి తీసుకుంటావు
నా నిషాతోనే దాహం తీర్చుకుంటావు
నీకూ నాకూ మధ్య ఈ అవినాభావ బంధం
అందుకే మాట్లాడుకోగలుగుతున్నాం మనం
ఒక శబ్దాల్లేని భాషలో....
నీవో పెద్ద కవయిత్రినని బడాయి పోతావు
నేను మొండికేస్తే నువ్వేమైపోతావు
నీ ఊహలపై అధికారం నాదే
నీ కలల రాజ్యానికి రారాజుని నేనే
షాయిరీలు, గజళ్ళు
చాందినీ రాత్రుళ్ళు
నక్షత్రాల ఊరేగింపులు
సుందరాంగులు అంగాంగవర్ణనలు
పొంగిన యవ్వనంలో
మురిపించావు కొన్నాళ్ళు
తెగినతాడు రాలిన నల్లపూసలు
చెదిరిన పసుపుకుంకాలంటూ
ఏడిపించావు మరి కొన్నాళ్ళు
అమ్మన్నావు బొమ్మన్నావు
బోసినవ్వులతో ఆటన్నావు
అమ్మతనమంటూ ఐసైపోయావిన్నాళ్ళు
యింకేమీ శోధించవా నీ కళ్ళు
వాస్తవికతల ప్రదర్శనలేనా
ఛట్రం బయటకు రాలేవా
నూతిలో కప్పవేనా...
సేవ పేరుతో వృద్దాశ్రమాలు
బందీలైన బికారి ముసలోళ్ళు
పాశవిక మారణ హోమాలు
కుళ్ళిన శవాలు
శరీర గుహలో నుండి అస్థిపంజరాలు
విదేశాలకు ఎగుమతులు
చలించే నీ వేళ్ళ మధ్య నేను
కారుస్తున్నా రక్తపు సిరాను
నీ గమ్యానికి వేరే లక్ష్యాన్ని సాధించు
మానవత్వాన్ని ఛేదించు..!