ఇదొకటి....: -- యామిజాల
 అది సాయంత్రం వేళ. ఒక్కణ్ణే ఉన్నా. పెన్నూ డైరీ...ఎదుటే ఉన్నాయి టీపాయిమీద. ఈ రెండూ ఇష్టమే.....వాటిని మోసే టీపాయీ ఇష్టమే. పెన్నూ డైరీ నాకు ఊహ తెలిసినప్పటి నించీ ప్రియమైనవే. అందుకు పరోక్ష ప్రత్యక్ష ప్రోత్సాహకులు మా నాన్నగారే. 
మా నాన్నగారు అకన్నేళ్ళుగా డైరీ రాస్తుండటం చూశాను. అప్పుడప్పుడు ఇతరుల డైరీ  చదవడం సంస్కారం కాదని తెలిసినా చాటుమాటుగా నాన్నగారి డైరీ చదివిన సందర్భాలున్నాయి. తన రచనల గురించీ, వ్యక్తిగత విషయాల గురించీ అందులో రాసుకోవడం చూశాను. నాకూ అలా రాయాలనిపించేది. రాయడం మొదలుపెట్టిన సందర్భాలున్నాయి. కానీ ఏ ఏడాదీ పూర్తిగా రాసింది లేదు. 
కారణం నిజాలు రాయాలి. కానీ ఆ నిజాలు ఎలా రాసుకోవడం. ఒకవేళ సాహసించి రాసినా డైరీ పట్టుకుని తిరగలేనుగా నేనెళ్ళే ప్రతి చోటుకీ. ఇంట్లో పెట్టేసి పోవాలి. అలా బయటకు వెళ్ళినప్పటి నుంచీ మనసుని ఓ భయం వెన్నాడుతుంది. 
ఎందుకంటే నా మనసుకి తోచిందల్లా రాయగలగాలి. అంతేతప్ప ఏదో కథలు రాస్తున్నట్టు కల్పితాక్షరాలతో పేజీలు నింపడంవల్ల ఏ ప్రయోజనమూ లేదు. అయినా మనసుకి అద్దంపట్టే మాటలతో నా అరవై ఏడేళ్ళ జీవితంలో కనీసం పది పన్నెండుసార్లయినా డైరీ రాయడం మొదలుపెట్టాను. కానీ ఎప్పుడూ ఒక్క ఏడాదైనా పూర్తిగా రాసింది లేదు. అప్పుడనిపిస్తుంటుంది నాదంతా ఆరంభశూరత్వమేనా అని. అవును. అందులో ఆవగింజంత అబద్ధం లేదు. 
నాకు ఇష్టమైన ఓ వ్యక్తి గురించి రాయడానికి పూనుకోవడం, కొంత కాలం కొండంత ఉత్సాహంతో రాయడం, అనంతరం ఆపేడం పరిపాటైపోయింది. అందుకు కారణం....నిజాలను అక్షరబద్దం చేయలేకపోవడమే....ఆ రాసుకున్న మాటల్ని కుటుంబసభ్యులు చదివి నన్నెలా అర్థం చేసుకుంటారోనని జంకు. ఇటీవల ఓ తమిళ కథొకటి చదివాను. ఓ అమ్మాయి రాసుకున్న డైరీ తీరా ఆ అమ్మాయి వైవాహిక బంధాన్నే విచ్ఛిన్నం చేసింది. ఓ ఉమ్మడి కుటుంబంలో జరిగిన విషయం. ఆమె రాసుకున్న డైరీని చదవమని భర్తతో సహా ఇంట్లోని వారందరూ చదివి వినిపించమంటారు. అయితే ఆమె చదవడానికి నిరాకరిస్తుంది. అది పూర్తిగా తన వ్యక్తిగతమని ఒకటికి పదిసార్లు చెప్తుంది చదవనని. దాంతో భర్త ఆమెను ఇంట్లోంచి పంపించేసి మరో పెళ్ళి చేసుకున్నట్లు కథ ముగుస్తుంది. 
భార్యే కావచ్చు భర్తే కావచ్చు డైరీ అనేది వ్యక్తిగతం. కానీ ఆ డైరీలో ఏముందోననే అనుమానంతోనో ఆసక్తితోనే బలవంతంగా చదవాలనుకుంటే అది తీవ్ర సమస్యకు దారి తీస్తుందనడంలో రవ్వంత అనుమానమూ లేదు. జీవితంలోని నిజాన్ని నిర్భయంగా రాసుకోలేనప్పుడు డైరీ రాయడం వృధా ప్రయాసే....