అరుగుల ఇల్లు (-బాలగేయం ):-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు.


 అరుగులున్నదీ మా ఇల్లు 

అందరికీ ఇది హరివిల్లు !

పొద్దున్నే చదివే పాఠాలు  

పెద్దలు పేపర్ చదువులు!


ఆకులు,కాయలు వలిచే చోటు 

ఉప్పులు పప్పులు ఎండే చోటు 

తప్పకుండాను సాయంత్రాలు 

కాలక్షేపం జరిగే చోటు!


వెన్నెలరాత్రి బువ్వలు తింటూ 

బామ్మచెప్పే కథలను  వింటాం 

ఆదివారమూ  ఆట విడుపుగా 

అచ్చనగాయలు,గుజ్జనగూళ్ళు


దారినపోయే దానయ్యలకు 

వానలో కాస్త చోటిస్తుంది 

అమ్మలక్కలకు పిచ్చాపాటీ 

ఊరికి మేలు మా అరుగులు!