ఇదీ సంగతి - యామిజాల జగదీశ్

 అది ఆహ్లాదకర వాతావరణం. హైదరాబాదులో మేముంటున్న మౌలాలీకి దగ్గర్లో ఉన్న ఓ మైదానంలో జరిగిన ఘంటసాలగారి సినీ సంగీత విభావరి కార్యక్రమానికి వెళ్ళాను. అక్కడికి నా మిత్రుడొకడు వచ్చాడు. మేమిద్దరం ఇలా ఇక్కడే నెలకు రెండుసార్లయినా కలుసుకుంటూ ఉంటాం. ఓ చెవి వేదికపై గాయనీగాయకులు ఆలపించే పాటలకు అప్పగిస్తాం. మరో చెవి పరస్పరం మేము చెప్పుకునే మాటలు వింటుంది. అయితే మొన్నటిసారి మాటల మధ్యలో మిత్రుడు "మీ నాన్నగారిని మేము అప్పుడప్పుడూ తలుస్తుంటాం" అన్నాడు. 


"ఏ విషయంలో? ఆయన సాహితీ ప్రస్థానం గురించా?" అని అడిగాను నేను.


"అబ్బే... కాదు కాదు..." అన్నాడు.


"మరి దేనిమీద?" నా ప్రశ్న.


"మా తమ్ముడికి కుదిర్చిన పెళ్ళిమీద" అన్నాడు మిత్రుడు.


"బాగున్నారుగా వాళ్ళు" నా మాట.


"వాళ్ళు బాగుండకేం. లక్షణంగా ఉన్నారు"

అన్నాడు.


"మరేంటీ?"  అడిగాను.


"మ తమ్ముడి భార్య ఇంట్లోకి అడుగు పెట్టే ముందువరకూ ఉమ్మడికుటుంబమే మా ఇల్లు. ఆ అమ్మాయి వచ్చిన కొన్ని రోజులకే ముక్కచెక్కలైంది ఇల్లు. మా తమ్ముడు మాతో మాట్లాడటం మానేశాడు. మిగిలిన వాళ్ళ మధ్య మాటా మంతీ ఉన్నా పూర్వపు అనుబంధాలూ ఆప్యాయతలూ పోయాయి. ఉన్నామంటే ఉన్నామంతే. ఒకే అపార్టుమెంటులో ఉంటారు చెల్లెలూ, మా అమ్మ. తమ్ముడి ఫ్యామిలీ. చెల్లెలు పోతే కడసారిచూపులకు కూడా బయటకు రాలేదు వాడు. మా నించి వాడిని దూరం చేసేసిందా అమ్మాయి. ఏం చెప్పనూ....ఆ అమ్మాయిని కుదిర్చింది మీ నాన్నగారే. అందుకే తలచుకుంటాం. అయినా మీ నాన్నగారేం చేయగలరు? ఆయన సదుద్దేశంతోనే చెప్పి ఉండొచ్చు సంబంధం. ఆయనేం చేస్తారు పాపం అని మళ్ళీ మాలో మేం సర్దుకుంటాం...." అని మాట ఈడ్చాడు మిత్రుడు.


అప్పుడనిపించింది అమ్మో ఎవరికీ పెళ్ళి సంబంధాలు కుదర్చకూడదని. కానీ ఇక్కడో విషయం చెప్పాలి....


నేనూ నా బాల్యమిత్రుడు సూర్యనారాయణ ఓ మారు ఓ సంబంధం వాకబు కోసం ఒకరింటికి వెళ్ళాం. అప్పుడా ఇంటి పెద్ద "పెద్ద మొనగాడల్లే వచ్చారే...మీకే పెళ్ళిళ్ళు కాలేదు. మీకసలు ఏం తెలుసని వచ్చారు?" అని పంపించేశారు. 


అనుకుంటామేగానీ పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయమై ఉంటాయని. కానీ అదెంతవరకు నిజమో తెలీదు కానీ ఒకింత క్లిష్టమైందే ఈ పెళ్ళి వ్యవహారం.


జాలి పడో, కందుకూరి వీరేశలింగంగారిని మనసులో ఉంచుకుని ఏదో ఉద్ధరించాలనుకుని మంచికిపోతే మిగిలేవి కష్టాలూ కన్నీళ్ళే అన్నది కళ్ళారా చూసాం....


అందుకే పెళ్ళి విషయంలో ఎవరిష్టం వారిదే అన్నట్టుగా ఈ విషయంలో మా నాన్నగారు మా అన్నదమ్ములకు వారి వారి ఇష్టాలకు వదిలేసారు. కష్టమో సుఖమో వారే భరిస్తారనుకున్నారేమో.