ఓ రచయిత గులాబీలతో ముచ్చటిస్తూ కొన్ని ప్రశ్నలు వేస్తాడు.వాటికి గులాబీలు జవాబిస్తూ "పాదాలతో తొక్కించుకోవాలనుకుంటున్నాం" అంటాయి."అదేంటీ? ఎందుకట్లా తొక్కించుకోవాలనుకుంటున్నారు? మీరు అందానికి మారుపేరు. మీ పరిమళం సరేసరి. వికసిత వదనంతో అందరినీ కట్టిపడేసే రూపంమీది. అటువంటి మీకు దేవుడి పాదాల దగ్గర ఉండాలనే కోరిక లేదా? ఓ స్త్రీ జడలో స్థానం దక్కించుకోవాలని లేదా? ప్రేమికుల మధ్య ప్రేమతో ఇచ్చిపుచ్చుకోవాలని లేదా? దండలై పెళ్ళప్పుడు వధూవరుల మెడలో ఉండాలనో, సన్మానాలు పొందే వారి మెడలో ఉండాలనో ఎందుకనుకోవడం లేదు? ఇలాటి ఆశలేవీ లేకుండా ఎవరి పాదాల కిందో నలిగిపోవాలని ఎందుకనుకుంటున్నారు? ఏమిటీ విపరీతమైన కోరిక?" అని రచయిత అడగ్గా గులాబీలిలా చెప్పాయి..."మాతృదేశ పరిరక్షణ కోసం అహర్నిశలూ శ్రమిస్తూ ధైర్యసాహసాలను ప్రదర్శించే సైనికుల పాదాలకింద నలిగిపోవాలన్నదే మా కోరికా. మా ఇష్టమూ. అంతేతప్ప మరేకోరికా మాకు లేదు..." అని!!
గులాబీల మాట: -- యామిజాల జగదీశ్