“ఆ... ఏం కుశలంలే పిల్లి బావా! నా దిగులంతా నీ గురించే” అంది నక్క“నా గురించా!... ఎందుకూ?...” అంది పిల్లి.“నీకు ఉపాయాలే తెలియవు. ఆపద వస్తే ఎలాతప్పించుకుంటావో ఏమో. నాకయితే వేల ఉపాయాలు తెలుసు. అపాయం వస్తే ఏదో ఒక ఉపాయం అల్లుతాను. ముప్పు తప్పించుకుంటాను” అంది నక్క.“నాకు ఒక ఉపాయం తెలుసులే నక్క బావా! ఆ ఉపాయంతో తప్పించుకుంటాను. నీవేమి దిగులుపడకూ" అంది పిల్లి.“ఆ... వేల జిత్తులు తెలిసిన నేనే ఎత్తులు పారక ఒక్కొక్కసారి చిత్తు అవుతున్నాను. తెలిసిన ఒకే ఒక ఉపాయంతో అపాయాలు ఎలా ఎదుర్కొంటావో ఏమో?" అంది నక్కఇవి ఇలా మాట్లాడుకుంటున్నాయి. ఇంతలో దూరంగా "భౌ... భౌ...” అని అరుపులు వినిపించాయి. "నక్క బావా! తప్పించుకో... అవి వేట కుక్కల అరుపులు. త్వరగా పారిపో. లేకుంటే వాటికి ఆహారం అవుతావు” అంది పిల్లి. నక్కకు ఏమి. చేయాలో పాలుపోలేదు. అక్కడక్కడే తచ్చాడుతుంది. కాలు, చేయి ఆడటం లేదు. నాలుక ఎండిపోయిపిడచకట్టింది. భయంతో నోటమాట రావటం లేదు.పిల్లి తనకు తెలిసిన ఒకే ఒక ఉపాయాన్ని ఉపయోగించింది. ఒక్క ఉదుటున చెట్టుపైకి పాకింది.ఎక్కి చిటారు కొమ్మన కూర్చుంది.వేట కుక్కలు రానే వచ్చాయి. నక్క మీద పడ్డాయి.నీతి : అక్కరకు రాని వేల ఉపాయాలకంటే, ఉపకరించే ఒకే ఒక ఉపాయం మేలు.
పిల్లి ఉపాయం. (బుజ్జిపిల్లలకు బుజ్జికథ): ౼ దార్ల బుజ్జిబాబు