కప్ప అహం (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

        అదొక చిన్న ఊరు. 
       ఆ ఊరిలో ఓ చెరువు ఉంది. 
       అందులో ఓ కప్ప ఉంటుంది. 
       అది అక్కడే పుట్టి పెరిగింది.
       ప్రపంచమంతా ఆ బుల్లి చేరువే అనుకుంటూ ఉంది. 
       దానికి ఒంటి నిండా అహం ఉండేది. 
       అన్నీ తనకే తెలుసు అనుకుంటూ విర్రవీగేది.
       తోటి వారిని చాలా చులకనగా చూసేది. 
       ఒక రోజు పెద్ద వాన కురిసింది. 
       వాన నీటికి ఓ కొత్త కప్ప కొట్టుకు వచ్చింది.
       దీన్ని చెరువు కప్ప చూసింది. 
       "ఏం మిత్రమా! ఎక్కడి నుండి రాక. ఈ విశాలమైన నీటిలోకి చేరి ధన్యుడవు అయ్యావు. నాలాంటి యోగ్యత నీకూ కలిగింది" అంది. 
         కొత్తకప్ప ఆశ్చర్యపడింది.  
         "ఏమిటి దీని పిచ్చి మాటలు. మూరెడు చెరువులో ఉండి బారెడు కోతలు కోస్తుంది. దీనికి జ్ఞానబోధ చేయాలి. లోకజ్ఞానం నేర్పాలి" అనుకుంది. 
         "మిత్రమా! మీది ఈ ఊరేనా? వేరే ఊరు ఎప్పుడు వెళ్లలేదా?"  అని అడిగింది.
         "మా ఊరుకన్నా గొప్ప ఊరు మరొకటి ఉందా ఏమిటి? ఉంటే నీవు ఇక్కడికి ఎందుకు వస్తావు?" అని పకపకా నవ్వింది పాతకప్ప.
          కొత్తకప్ప నెత్తిమీద చేతులు పెట్టుకుంది.
          "ఓ పిచ్చి మాలోకమా! నీవు ఉండేది ఓ బుల్లి చెరువు. దీనికన్నా పెద్దవి కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. రా చూపిస్తా!" అన్నది. 
         రెండూ కలిసి ప్రయాణం అయ్యాయి.
         ఊరు దాటాయి. 
         పారుతున్న ఏరులో దుకాయి.
         యేటి నీటిలో ఈదుతూ నదిలో చేరాయి. 
          నదిని చూసి చెరువు కప్ప నోరెళ్ల బెట్టింది. 
          అక్కడ నుండి సముద్రానికి చేరాయి. 
          సముద్రాన్ని చూసి తేలగళ్లు వేసింది. 
          తేరుకుని ఇలా అంది
          "మిత్రమా! నన్ను మన్నించు. నా కళ్ళు తెరిపించాయి. అంతా ఆ చెరువే అనుకున్నాను. ఎంత అవివేకినో తెలుసుకున్నాను. నా అహం తొలిగిపోయింది" అంది చెరువుకప్ప. 
         పాతకప్ప మార్పుకు కొత్తకప్ప సంతోషించింది. 
        నీతి: అన్నీ మనకే తెలుసు అనుకోవడం అవివేకం.