సంగీతాభిమాని ఆస్వాదన:-- యామిజాల జగదీశ్
 తంజావూరుని పాలించిన రాజులలో శరభోజి మహారాజు ఒకరు. 
ఆయన హయాంలోనే తంజావూరులో సరస్వతీ మహల్ లైబ్రరీ ఏర్పాటైంది. ఆసియా ఖండంలో పదహారో శతాబ్దంలో నెలకొన్న పురాతన గ్రంథాలయాలలో ఈ సరస్వతీ మహల్ ఒకటి. ఇక్కడ అరుదైన పుస్తకాలు, తాళపత్ర ప్రతులనేకం ఉన్నాయి. 
ఆ మాట అటుంచితే ఇక్కడ చెప్పబోయే విషయం మరొకటుంది.
శరభోజికి కళలన్నా కళాకారులన్నా ఎంతో ఇష్టం. వారిని ఆహ్వానించి ఘనంగా సత్కరించడంలో ఎప్పుడూ ముందుండే వారు. 
ఓమారు మైసూరు నించి ఒక సంగీత విద్వాంసుడిని ఆహ్వానించి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి ప్రజలను కూడా అనుమించడమే కాకుండా విందుకూడా ఇచ్చారు. 
కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షకులు సంగీతాన్ని ఆస్వాదించినట్టు నిరూపించుకోవడానికి తలలు ఊపుతూ చప్పట్లు చరుస్తూ సెభాష్ సెభాష్ అంటూ హర్షధ్వానాలు చేశారు. అది చూసి రాజుకి పట్టరాని ఆనందం వేసింది. 
మంత్రిని పిలిచి చూసావో ప్రేక్షకుల రసాస్వాదన అంటూ పొగిడారు. 
అయితే మంత్రి "రాజా! నాకెందుకో వారు సంగీతం కోసం రొలేదనిపిస్తోంది. వారందరూ మీరు ఏర్పాటు చేసి విందు భోజనం కోసం వచ్చారనిపిస్తోంది. తన మాట నిజమో కాదో మీకే తెలుస్తుంది. రేపు మళ్ళీ ఈ సంగీత విద్వాంసుడి కార్యక్రమమే ఏర్పాటు చేయండి. విందుకొచ్చిన వారెంతమందో సంగీతం వినడానికి ఎందరు వచ్చారో తెలుస్తుంది" అన్నాడు. 
రాజు అలాగేనని మరుసటిరోజే ఇవాళ్టి సంగీత విద్వాంసుడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటిస్తూ అందరికీ విందుభోజనంకూడా ఉంటుందని చెప్పాడు. 
ఇంకేముంది....రెండో రోజూ ఆ సంగీత విద్వాంసుడి కార్యక్రమం ప్రారంభమైంది. ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చారు. 
అయితే మంత్రి తన మాట నిజమని  నిరూపించడంకోసం  మనసులో అనుకున్నది అమలు చేయసాగాడు.
కార్యక్రమానికి వచ్చిన  ప్రేక్షకులందరికీ తలో చీటి ఇచ్చాడు మంత్రి. ఆ చీటీలో ఉన్న మాట ఇదే...
"సంగీతం ఆస్వాదిస్తే ఆస్వాదించండి. కాదనను. కానీ ఎవరైనా తలలు ఊపుతూ చప్పట్లు చరిచారో వారి తల తీసేస్తాం" అని!
ఇంకేముంది...
ప్రేక్షకులెవ్వరూ తలలు ఊపలేదు. చప్పట్లు కొట్టలేదు. మౌనంగా వింటున్నారు. అయితే ఒకే ఒక్కడు సంగీతాన్ని ఆస్వాదించడమే కాకుండా మైమరచిపోయాడు. తల ఊపాడు. చప్పట్లు కొట్టాడు. 
రాజుకి ఆశ్చర్యమేసింది. విద్వాంసుడి సంగీతం వీనులవిందుగా ఉంది కదా. ఒక్కడు తప్ప మరెవరికీ ఈ కార్యక్రమం నచ్చలేదా...మంత్రి చెప్పినట్లు అందరూ తానేర్పాటు చేసిన విందుకోసమే వచ్చేరా అనుకున్నాడు 
మంత్రి ఓ భటుడిని ఆ ప్రేక్షకుడి వద్దకు పంపి అతనిని తీసుకురమ్మన్నాడు. 
భటుడు అలాగేనని అతనిని మంత్రి వద్దకు తీసుకొచ్చాడు. 
అతనితో "తల ఊపుతూ చప్పట్లు కొడితే తల తీసేస్తానని హెచ్చరించినా నువ్వేమీ పట్టించుకోక  తల ఊపావు...చప్పట్లు కొట్టావు....ఇందువల్ల తెలిసిందేమిటంటే మిగిలిన  వాళ్ళందరూ కేవలం విందుకోసం మాత్రమే వచ్చారని! తల తీస్తే తీయనీ అన్నట్టుగా నువ్వు సంగీతాన్ని ఆస్వాదించడంతో నీకొక్కడితే ఈ కార్యక్రమంమీద ఆసక్తి ఉన్నట్టు బోధపడింది. అందుకు నీకు మా అభినందనలు"  అంటూ అతనిని పొగడటమే కాకుండా రాజుతో సమ్మానింపచేసాడు మంత్రి.