అంగరగారికి నమస్సులు:-- యామిజాల జగదీశ్

 నా బాల్య స్నేహితులలో మోచర్ల ప్రభాకర్ ఒకడు. అప్పుడప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. "బాల్యమిత్రులు" అనే పేరుతో మా క్లాస్ మేట్స్ అందరం వాట్సప్ వేదికగా అవీ ఇవీ షేర్ చేసుకుంటాం. ఆ గ్రూపులో ప్రభాకర్ "పది నిముషాలు..." అంటూ కొన్ని మాటలతో ఓ పోస్టు పెడితే బాగుందని ఫోన్ చేసి మాట్లాడాను. 
మాటల మధ్యలో ప్రభాకర్ ఓ విషయం చెప్తే ఆశ్చర్యమేసింది. అదేంటంటే....
ప్రభాకర్ మావగారి పేరు 
శ్రీ అంగర గోపాలకృష్ణ రావుగారు. ఆయన వయస్సు ఎనబై ఎనిమిదేళ్ళు. ఆయన పుట్టిపెరిగింది రాజోలు. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ లో పని చేశారు. ఇప్పుడు ఉంటున్నది రాజమండ్రిలో. ఈ విషయమట్లా పక్కన పెడితే ఆయన ఇటీవల ఓ వంద పద్యాలు రాశారట. చిన్నప్పుడెప్పుడో చదువుకోవడమే. అయితే ఆరు నెలల క్రితం ఛందస్సు, వ్యాకరణం వగైరా పట్టుదలతో చదివి పద్యాలు రాయడం. ఆటవెలది, తేటగీతి తదితర వృత్తాలలో ఈ వంద పద్యాలు రాయడం విశేషం. 
ఆయన వ్యాపకం శ్రీనాథుడు తదితర మిత్రబృందంతో కలిసి సాహిత్యాంశాలు చర్చించడం. ఏదో ఒక అంశంపై మాట్లాడుకుని పద్యాలు రాయడం. 
ఆయనకు జ్యోతిష్యంలోనూ పట్టుంది. 
తన కుమార్తె పెళ్ళి సంబంధాలకోసం ప్రభాకర్  జాతకాలు కలిసాయో లేదో చూడమని తన మావగారికి పంపుతుంటే వాటిని ఆయన పొరుగున ఉన్న ఓ జ్యోతిష్కుడితో చర్చించేవారట. అలా అలా ఆయన జ్యోతిష్యంమీదా ఆసక్తి పెంచుకుని జాతకచక్రాలు అధ్యయనం చేయసాగారు.
ఆయన పద్యరచన వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ అది స్ఫూర్తిగా తీసుకుని నంవ్వు పద్యాలు రాయడం మొదలుపెట్టమని ప్రభాకర్ సూచించాడు. ప్రభాకర్ మాటలు వింటుంటే మా నాన్నగారు కళ్ళముందు ప్రత్యక్షమయ్యారు. ఛందస్సు, అలంకారాలు చెప్తూ నాతో ఓ డజన్ కంద పద్యాలు రాయించారు కూడా. అప్పుడే నాతో సంస్కృతంలో రామశబ్దం కూడా చెప్పించారు. కానీ తమిళ కవితలు అందులోనూ ప్రత్యేకించి ప్రేమకవితలపై మనసు పారేసుకుని  మా నాన్నగారి మాట పెడచెవిన పెట్టాను. మా నాన్నగారు నన్నెక్కడ కూర్చోపెట్టి పద్యాలు రాయిస్తారోనని తప్పించుకు తిరుగుతుండేవాడిని. నేనీరోజు బాధ పడి ఏం లాభం....? పద్యాలన్నీ  బట్టీ పట్టి చదివిన బాపతు. అంతేతప్ప శ్రద్ధగా ఓ తీరున చదువుకోలేదు. ఇప్పుడు రాయడమనేది ఆలోచించాల్సిన విషయమే. 
ఏదేమైనా ఎనబై ఎనిమిదో ఏట ఛందస్సుపై పట్టు సాధించి వంద పద్యాలు రాసిన అంగర గోపాల కృష్ణ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.