సామెత కథ :ఎం. బిందు మాధవి


 దొంగలు పడ్డ ఆరు నెల్లకి

కుక్కలు మొరిగాయిట!

 

రావు గారు, మూర్తి గారు ‘ప్రాణ స్నేహితులు’, ‘బాల్యమిత్రులు’, ‘దగ్గరి బంధువులు’ కూడా. వారికి బంధుత్వం కంటే కూడా స్నేహమే ఎక్కువ. చిన్నప్పుడు ఒకే చోట ఉండే అవకాశం ఉన్నందువల్ల ‘ఒకే మంచం’, ‘ఒకే కంచం’ లాగా బ్రతికారు. వారిద్దరి వయస్సు ఎనభైయ్యేళ్ళ పై మాటే.

ముందుగా మూర్తి గారికి పెళ్ళి అయింది. ఆయన తన సంసారం, పిల్లలు, బాధ్యతలు, ఉద్యోగం, అందులో బదిలీలు, వీటిలో పడి కాలం ఎలా గడిచిపోయిందో గమనించలేదు. కాకపోతే ఇద్దరిదీ ఒకే ఊరు అవటం వల్ల బంధువుల ఇళ్ళల్లో శుభకార్యాలకి వచ్చినప్పుడో, లేదా అత్తవారింట్లో పండుగలకి వచ్చినప్పుడో కలుస్తూ ఉండే వారు.

మూర్తి గారికి పెళ్ళయ్యాక దాదాపు పదేళ్ళకి ‘రావు’ గారికి పెళ్ళి అయింది. మూర్తి గారు, తన భార్య పిల్లల్ని తీసుకుని పెళ్ళికి వెళ్ళారు. అలాగే తరువాత కూడా మూర్తి గారి పిల్లలు, రావు గారి పిల్లలు కలిసి వేసవి కాలం సెలవలు గడిపేవారు. కలిసినప్పుడల్లా చిన్నప్పుడు తండ్రులు ఎలా ఆత్మీయంగా గడిపేవారో, పిల్లలు కూడా అలాగే వయసు తేడా ఉన్నా కూడా, బాగా కలిసిపోయి సెలవులు గడిపేవారు. మూర్తి గారి భార్య, రావు గారి భార్య కూడా కలిసినప్పుడు ఎంతో ఆత్మీయంగా కబుర్లు చెప్పుకునేవారు.

పిల్లలు పెద్ద వాళ్ళయ్యాక పెళ్ళిళ్ళు, పేరంటాలు అయినప్పుడు ముందుగానే వచ్చి ఒకరికొకరు సహాయం చేసుకుని నిండుగా కార్యక్రమాలు జరిపించేవారు. పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాక వారి పిల్లలు కూడా, అంటే మూడో తరంలో కూడా అన్నమాట, రావు తాతయ్య అని ఆ మనవళ్ళు, మూర్తి తాతయ్య అని ఈ మనవళ్ళు ఒకరింటికి ఒకరు వెళుతూ వాళ్ళ చిన్నప్పటి జీవితాలు, అనుభవాలు కధలు కధలు గా చెప్పించుకుని విని ఆనందించే వారు.

కాలంలో మూర్తి గారి భార్య చనిపోయి ఆయన ఒంటరి వాడు అయ్యారు. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు అల్లుళ్ళు, మనవలతో కాలక్షేపం అవుతున్నా మనసులో ఏదో తెలియని ఒంటరితనం తో అంతర్ముఖులవుతూఉండే వారు. అప్పుడపుడు రావు గారు ఫోన్ చేసి ఏవో చిన్నప్పటి కబుర్లు చెబుతూ, ఏవో ఒకటి మాట్లాడుతూ ఉండేవారు. మూర్తి గారికి అదో కాలక్షేపం అవుతూ ఉండేది.

ఇంతట్లో హఠాత్తుగా ‘రావు’ గారు, చెప్పా చెయ్యాకుండా భగవత్ సాన్నిధ్యానికి వెళ్ళిపోయారు. ఏ జబ్బూ లేదు, కనీసం ఏ చిన్న అనారోగ్యపు సూచన లేకుండా తిరుగుతూ తిరుగుతూ ఉన్నాయన చనిపోవటం ఒక పెద్ద షాక్ అయింది, మూర్తి గారికి. ఆ విషయం మనసుకి జీర్ణం అవటానికి చాలా కాలం పట్టింది. ‘రావు’ గారు చనిపోయిన రోజు ‘మూర్తి’ గారికి నలతగా ఉండటం వల్ల వెంటనే వెళ్ళలేకపోయారు.

అదీ కాక రావు గారి పార్ధివ శరీరం, వారి అ బ్బాయి రాక కోసం ఎదురు చూడవలసి రావటం వల్ల మార్చూరీ లో పెట్టారు. మూర్తి గారు, ఆ తరువాత దహన సంస్కారాలకి కూడా వెళ్ళలేకపోయారు. ‘రావు గారి భార్యని’ ఫోన్‌లో పరామర్శ చెయ్యటానికి మనసొప్పక ఏరోజుకారోజు ఇంటికెళ్ళాలను కోవటం, ఏదో ఒక ఇబ్బంది వచ్చి వెళ్ళలేకపోవటం జరిగింది. ఇలా ఆరునెల్ల కాలం జరిగిపోయింది.

మూర్తి గారు తన పిల్లలతో, రావు గారింటికి వెళ్ళాలి, ఆయన భార్యని పరామర్శ చెయ్యాలి, అది కనీస ధర్మం అని చెబుతూ వచ్చారే కానీ వెళ్ళలేకపోయారు.

కాలం బలమైనది కదా! ఎంత గాయాన్నైనా మరిపించి మళ్ళీ మామూలు మనిషిని చేస్తుంది. క్రమేణా రావు గారి భార్య మళ్ళీ తన దైనందిన జీవితంలో పడింది. అనుకోకుండా ‘మూర్తి గారు’ రావు గారి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది.

‘రావుగారు’ చనిపోయి అప్పటికి దాదాపు 8-10 నెలలు గడిచిపోయాయి కానీ, మూర్తి గారు మాత్రం అప్పుడే వచ్చారు కాబట్టి ‘పరామర్శ’ చేసినట్లు మాట్లాడితే ‘బాగుంటుందో బాగుండదో’, ఆ ప్రస్తావనే చెయ్యకుండా మాట్లాడితే తప్పఔతుందేమో’ తెలియక మూర్తి గారు తర్జన భర్జన పడ్డారు.

‘అందుకే ఎప్పటి విషయం అప్పుడు వెంటనే పూర్తి చెయ్యాలి, లేకపోతే ఇలాగే జగన్ సానుభూతి యాత్ర లాగా, " దొంగలు పడ్డ ఆరునెల్లకి కుక్క మొరిగినట్లు" అసందర్భంగా ఉంటుంది’ అని మూర్తి గారు నిట్టూర్చారు.

ఇలాంటి పరిస్థితులు ,మనకి కూడా అప్పుడప్పుడు తటస్థ పడుతూ ఉంటాయి కదా! కొంచెం శ్రద్ధ పెడితే వాటిని అధిగమించవచ్చు.

* * *