ఎందుకొస్తారండీ నడవడం చేతకాకుంటే!: -- యామిజాల జగదీశ్
 ఎందుకొస్తారండి నడవడం చేతకానప్పుడు?
ఇప్పుడేమన్నా జరిగుంటే ముసలాయన్ని డీకొట్టాడని నన్ను పట్టుకునే వారు... ముందువెనుకలు చూసి నడవాలండి....
- ఇలా మరో రెండు మాటలు చెప్పి తుర్రుమన్నాడు ఓ ద్విచక్రవాహనధారి...
ఈ మాటలకు నాకేం కోపం రాలేదు కానీ నా నడకే ప్రశ్నార్థకమైంది. 
అయినా మరొక్క మాట అనకపోవడం కాస్త ఉపశమనమే..."ఇంట్లో చెప్పేసొచ్చేవా" అనలేదు.
ఏమీ లేదండోయ్...
రెండు రోజులక్రితం జరిగిన సంఘటన ఇది.
రోడ్డుపై నడవడం అనేది కత్తిసాములాటి దైపోయింది. ఒకవైపు నుంచి మరొకవైపుకి రోడ్డు దాటడం గగనమే. 
నా విషయంలో వయస్సు మాటలా పక్కనపెడితే కాస్తంత తగ్గిన వినికిడి శక్తి!  చూపులదాకా పరవాలేదు. నడక తడబడటానికి ప్రధాన కారణం మోకాలి నొప్పులు..... !! 
విపరీతంగా నడిచేవాణ్ణి. పైగా వేగంగానూ! అయితే ఓ ఏడాదిపైనే అయింది మోకాలి నొప్పులు ప్రారంభమై!! ఇందువల్ల నడక బాగా నెమ్మదించింది. గట్టిగా వేగంగా అడుగులు పడవు. అంతమాత్రాన నేనేమీ నడక మానలేదు. నడుస్తూనే ఉన్నా. ఏదో ఒక పనిమీద బజారుకి వెళ్తూనే ఉంటాను. అలానే వెళ్ళాను దుకాణానికి. వెళ్ళవలసిన దూరంలో సగం నడక బాగానే సాగింది. ఇంతలో ఎదురుగా ఓ తాటి చెట్టు, ఆ చెట్టు వెనుక రెండు ఆవులూ...వాటి నించి తప్పుకోవడంకోసం వేసిన అడుగులు తడబడ్డాయి.  సరిగ్గా ఆ సమయంలోనే ఓ  ద్విచక్రవాహనదారుడు వేగంగా వచ్చాడు. నా దగ్గరకు వచ్చేసిందా వాహనం. మరొక్క అడుగు గానీ వేసుంటే ప్రమాదం జరిగే ఉండేది. అయితే అతను నేర్పుగా నడిపి రెండడుగులు ముందుకు వెళ్ళి బండి ఆపి సరిగ్గా నడవాలండీ అన్నాడు. అతనలా అనడంలో తప్పేమీ లేదు. నాదే పొరపాటు.  నా కుడి చేతికి బండి తగిలి నేను కింద పడాల్సిందే. అయితే ఆ దుర్ఘటన తప్పితే తప్పి ఉండొచ్చుకానీ ద్విచక్రవాహనధారి మాటలతో నా నడకపైనే నాకు కోపమూ, బాధా కలిగాయి.
ఒక్కసారి గతంలోకెళ్తే...
ఎంత వేగంగా ఎంత దూరమన్నా నడవడానికి వెనకాడేవి కావు నా కాళ్ళు.
అలవోకగా అడుగులు వేసేసేవాడిని. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ రోజుల్లో సిటీ బస్సులు సరిగ్గా నడిచేవి కావు. అటువంటప్పుడు నేనున్న రామ్ నగర్ గుండు నించి బంజారా హిల్స్ లో ఉండే సాక్షి పత్రికాఫీసుకి నడిచి వెళ్ళి నడిచొచ్చిన రాజులున్నాయి. ఇంటి నించి ఆఫీసుకి ఇలా నడవడానికి సరిగ్గా వంద నిముషాలు పట్టేది. మధ్యలో ఓ చోట ఆగి ఒక అరటి పండు తిని ఏదో ఒక బస్టాప్ లో కాస్సేపు కూర్చుని టైముకి ఆఫీసులో ఉండేవాణ్ణి. ఎప్పుడూ లేట్ మాస్టర్ అనిపించుకోలేదు. అలాటిది ఇప్పుడు ఓ మూడు వీధుల అవతల ఉన్న షాపుకెళ్ళడానికి కనీసం ఇరవై నిముషాలు పడుతోంది. 
వయస్సు అరవై ఏడు...
తెలీకుండానే శక్తి తగ్గడం మొదలైంది. తడబాటు తప్పలేదు. రోడ్లపై బండ్ల హారన్లు వింటుంటే  ఓ జంకు. బండ్ల రద్దీ మరీ మరీ తలనొప్పవుతోంది. వాటిని నేనాపలేను కనుక నేనే నా నడకను సక్రమంగా సాగించాలి. కొంపలు మునిగిపోయేంత పనులేవీ లేవు కనుక నెమ్మదిగా అడుగులు వేయడం వల్ల నష్టమేమీ లేదు, నడకకు కాళ్ళు సహకరించే దాకా!!