నక్కపిల్ల ధైర్యం (బుజ్జిపిల్లలకు బుజ్జికథ): ౼ దార్ల బుజ్జిబాబు

 ఒకరోజు అడవిలోని జంతువుల పిల్లలు  కలిసి మెలిసి ఆడుకుంటున్నాయి. 
       అవి ఎంతో ఆనందంగా ఎగురుతూ, దూకుతూ  ఉన్నాయి. 
      అంతలో ఒక సింహం వచ్చింది. 
       పిల్లల్ని చూసి ముచ్చట పడింది.
       చెట్టు చాటున దాగి "బాల్యం ఎంత మధురమైనదో కదా?" అనుకుంది. 
      పిల్లలు సింహాన్ని చూడనే చూశాయి. 
      అవన్నీ తలా ఓ దిక్కు పారిపోయాయి.
      నక్కపిల్ల మాత్రం ధైర్యంగా నిలబడింది. 
      సింహం అక్కడికి వచ్చింది. 
      నక్కపిల్లకు భయంగా ఉన్నా,  ధైర్యం తెచ్చుకుంది. 
      ఎలా తప్పించుకోవాలా? అని ఆలోచించింది.
        "అయ్యా! మీరు ఈ అడవికి రాజు కదూ?" అని అడిగింది. 
        "ఔను" అంది సింహం. 
         వెంటనే నక్కపిల్ల   వినయంగా చేతులు జోడించి దండం పెట్టి "నమస్కారం" అన్నది. 
         "ఎవరు నీవు" అడిగింది సింహం. 
          "అయ్యా! మేము మీ సేవకులం. మీరు కనిపిస్తే మర్యాదగా పలకరించి పాదాలకు నమస్కారం చేయాలని మా అమ్మ చెప్పింది. మీరు ఎప్పుడు కనిపిస్తారా అని ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకు ఆ భాగ్యం కలిగింది" అని సింహం పాదాలమీద పడింది.
        సింహం నక్కపిల్లను లేపింది. 
        దాని వినయానికి ఆశ్చర్యపడింది. 
        మెడలోని బంగారు హారం తీసి నక్కపిల్ల మెడలో వేసింది. 
        "నక్కపిల్లా! చక్కగా చదువుకో. విజ్ఞానం సంపాదించుకో. నీకు ఏ సాయం కావాలన్న నేరుగా నా దగ్గరకు రా.  పెద్దయ్యాక నా కొలువులో పెద్ద ఉద్యోగం ఇస్తాను" అని చెప్పి వెళ్ళింది.
        తిరిగి జంతుల పిల్లలన్నీ వచ్చాయి.  
        నక్కపిల్ల వాటితో ఇలా అన్నది.
       " ఆపదలు వచ్చినపుడు పారిపోవడం పరిష్కారం కాదు. సమయస్ఫూర్తితో ధైర్యంగా ఎదుర్కోవాలి. భయపడితే బల్లి కూడా భయపెడుతుంది. ధైర్యంగా ఎదుర్కొంటే పులి కుడా పారిపోతుంది" అన్నది.
  నీతి: ధైర్యంలోనే విజయం దాగుంది.