తమిళనాడులోని ఉపన్యాసకులలో ఆయన ఒకరు. ఆయన మాటలు తరచూ వింటూ ఉంటాను. ఆయన పదవీ విరమణ చేసిన ఒక తమిళ మాస్టారు. ఆయన ప్రసంగాలు అప్పుడప్పుడూ వింటూ ఉంటాను.ఆయన చెప్పిన ఓ విషయం....ఆయనకు పెళ్ళయిన కొత్తలో జరిగిన అనుభవమిది.ఆయన భార్య ఓ వారం పదిరోజులకు ఓ మాట అడిగింది "ఏమిటండీ మీరు గుడికి వెళ్ళరా?" అని."వెళ్ళను. వెళ్ళే వాళ్ళనూ అడ్డుకుంటాను" అన్నారాయన."మా ఊళ్ళో నాకు గుడికి వెళ్ళడం అలవాటు. పోనీ నేను వెళ్ళొచ్చా .....""వెళ్తే వెళ్ళు. నన్ను రమ్మనకు. రాను""మంచిది" అంటూ ఆయన భార్య ఇంటికి దగ్గర్లో ఉన్న ఓ గుడికి వెళ్తే వచ్చింది.ఓరోజు గుడికెళ్ళి ఇంటికి వచ్చీరావడంతోనే "ఇవాళ ఏం జరిగిందో తెలుసాండీ" అంది ఆయన భార్య."ఏమైందే చెప్పు""ఏమీ లేదు....దార్లో కొందరు నావంకే చూస్తూ ఏవేవో అంటున్నారండి. ఒకడైతే నాన్ను కావాలనే డీ కొట్టాడండి""అలాగా...ఎవరది? చెప్పు. వాడ్నేం చేస్తానో చూడు""ఎందుకట్టా అరుస్తారు. మీరు నాతో వస్తే ఇవేవీ జరగవు కదండీ"మనసులో సరేననుకుని "రేపట్నుంచీ నీ వెంట వస్తానులే. కానీ నన్ను గుళ్ళోకి రమ్మనకు" అన్నారాయన.మరుసటిరోజు ఇద్దరూ కలిసి బయలుదేరారు.గుడి దగ్గరకు వచ్చాక ఆయన "లోపలికి నువ్వెళ్ళు. నేను రాను..." అన్నారు భార్యతో.ఆమె అలాగే అంటూ చెప్పులు విప్పింది.చెప్పులు నేను చూసుకోను అన్నారాయన."మిమ్మల్నెవరు చూసుకోమన్నారు? చెప్పులిక్కడ విడుస్తున్నాను. అవొస్తాయా లోపలికీ....రావుగా. అవిక్కడుంటాయి. మీరక్కడ నిలబడండి...." ఆంది ఆయన భార్య.ఇంతలో ఇద్దరు కుర్రాళ్ళొచ్చారు.చెప్పుల జతకెంతండీ అని అడిగారాయనను.ఆయనకు చిర్రెత్తుకొచ్చింది."నేను చెప్పులు చూసుకునేవాడిలా కనిపిస్తున్నానా....పొండిరా పొండి" అన్నారాయన.ఆ ఇద్దరు కుర్రాళ్ళూ పోతూ పోతూ ఆయన ఆడవాళ్ళ చెప్పులు తప్ప మగవాళ్ళవి చూడరనుకుంటానురా అని వ్యంగ్యంగా చెప్పి ఆయన వంక నవ్వుతూ చూసెళ్ళిపోయారు.గుళ్ళోకి వెళ్ళిన ఆయన భార్య తిరిగొచ్చింది.ఆమె వచ్చీరావడంతోనే మండిపడ్డారు జరిగింది చెప్పి.అప్పుడామె "ఎందుకు కోపమండి. ఇక్కడ నిలబడటం వల్లేగా ఇన్ని మాటలూ...రేపట్నుంచి మీరు లోపలికి రండి నాతోపాటు" అంది.గుడి బయట నిల్చుని మాట పడే బదులు లోపలికి వెళ్ళడమే మేలనుకుని మరుసటి రోజు భార్యతో కలిసి లోపలికి వెళ్ళారు.ఆయన ఆరోజే మొదటిసారి చూడటం దేవుడికి పూజ చేయడమన్నది. అర్చన జరుగుతున్నంతసేపూ అందరూ దణ్ణం పెట్టారు. ఆయన మామూలుగానే నిల్చున్నారు. అప్పుడామె దణ్ణం పెట్టండి అని మెల్లగా చెప్పింది ఆయనతో...అంతే, ఆరోజు దేవుడి సన్నిధిలో జోడించిన చేతులను ఆ తర్వాత మరి మానలేదు.ఇంట్లోనే కాక గుడికీ క్రమం తప్పక వెళ్తూ భగవంతుడికి నమస్కరించడం చేయడం మానలేదు. ఆ తర్వాతే ఆయన భక్తి సాహిత్యం చదవడం మొదలు పెట్టారు. ప్రబంధాలను చదివారు. వాటిని చదువుతుంటే అందులోని సాహిత్యం ఆయనతో మళ్ళీ మళ్ళీ అటువంటి పుస్తకాలను చదివింప చేసింది. చదువుకున్నది ఎం.ఎ అయినా అంతవరకూ శ్రద్ధతో చదవని ఆధ్యాత్మిక అంశాలను ఒక్కొక్కటీ చదువుతూ తరించిన ఆయన అరెరె ఇంతటి సాహిత్యాన్నీ మంచి విషయాలనూ చదవకుండా వదిలేసానే అని లోలోపల బాధ పడ్డారు. భార్యకు కృతజ్ఞతలు చెప్పారు.అందుకే ఆయన తన భార్యనే ఆధ్యాత్మిక విషయంలో గురువుగా చెప్పుకుంటూ ఉంటారు.
భార్యే గురువు: -- యామిజాల జగదీశ్