మనిషే: -రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి
 నేల ఎన్నిటిని సింగారించుకుంటుందని...
ఎన్ని సుగంధాలను పూసుకుంటుందని –
ఒకసారి జొన్నకంకి అందంతో 
ఒకసారి వరి మొక్కల చందంతో
మరోసారి కంది కాంతుల ఒయ్యారాలతో
మరోసారి  తెల్లని పత్తి తెలుపుతో
మరోసారి పెసర ఆకు పచ్చదనంతో
మందారపు మమకారంతో
ఇంకోసారి అరటి శీతోపచారాలతో
ఇంకోసారి పొగాకు సుగంధంతో
ఇంకోసారి పసుపు గుభాళింపుతో
ఇంకోసారి కొత్తిమీర పరిమళంతో
వేరొకసారి చిలకమొక్క పూల మురిపాలతో
వేరొకసారి రాలిన పారిజాతాలతో
వేరొకసారి పున్నాగపూల పులకరింతలతో
వేరొకసారి తరుచ్ఛాయలతో
ఇన్ని అందాలు గంధాలనే కాదు
ఎంత  ఆర్తిని ... ఆప్యాయతను 
తనలో దాచుకుంటుందో
మనిషే ఏమీ రాక – చేతకాక 
ఏమీ కాక
సౌందర్యాన్ని ఆస్వాదించటం కూడా  రాక..
అసలా సౌందర్యాన్ని గుర్తించడమే రాక..
నేల – ఎన్ని రుచుల్ని వడ్డిస్తుంది –
ఎన్ని వసతుల్ని – వనరుల్ని ఇస్తుంది – 
తృప్తిలేని మనిషి
నేలను ఇంకా ఇంకా ఛిద్రం చేస్తూ –
ఇంకా ఇంకా బాధిస్తూ –
వేధిస్తూ – శోధిస్తూ –
దాని కోసమే అన్యుల వధిస్తూ – 
వధింపబడుతూ
అనామకంగా – అవివేకంగా
మనిషే...