వయస్సు ప్రభావం...: -- యామిజాల జగదీశ్.

 నలభై అనేది 
యవ్వన వృద్ధాప్యం
యాభై అనేది
వృద్ధాప్య యవ్వనం
అన్నారు ప్రముఖ ఫ్రెంచ్ రచయిత
విక్టర్ హ్యూగో.
ప్రపంచమంతటా ఎందరో మేధావులూ అనుభవజ్ఞులూ మానవహక్కుల సంఘాలూ వృద్ధాప్యాన్ని పండగలా చేసుకోవాలని వృద్ధులు సహజ జీవితాన్ని గడిపేందుకు దోహదపడాలని చెప్తున్నాసరే వృద్ధులను చీదరించుకునే ఈసడించుకునే తీరుతెన్నులు పెరుగుతూనే ఉన్నాయి తప్ప కించిత్ తగ్గలేదు. తనకూ ఓరోజు వృద్ధాప్యం
వస్తుందని తెలిసినాసరే వృద్ధులను హేళన చేసే వారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. వయస్సు పైబడటం జబ్బు కాదు. బతికిన జీవితాన్ని నిదానంగా నెమరేసుకునే పరువమే వృద్ధాప్యం. ఆ విషయాన్నే ఓ తల్లి తన కూతురుకి రాసిన ఉత్తరంలో చెప్పుకుంది....
ప్రియమైన కూతురా
ఈరోజు నువ్వు నన్ను చూస్తుంటే నేను ఓ వృద్ధురాలిలా కనిపిస్తున్నా కదూ....ముడతలు పడ్డ శరీరం. పళ్ళూడిపోయి ఏదీ నమల్లేని స్థితి....అన్నట్టు ఓపికతో ఈ ఉత్తరం చదువు.
కాస్తంత సహనం పాటించు. నా వృద్ధాప్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అదే నా కోరిక. 
మనం మాట్లాడుతున్నప్పుడు ఒకే విషయాన్నే ఒకటికి పదిసార్లు చెప్తుంటాను కదూ...
ఇంకొకసారి చెప్పేలోపు నువ్వు అడ్డుపడి అమ్మా చెప్పిన విషయాన్నే ఎన్నిసార్లు చెప్తావు...వినలేకపోతున్నా. దయచేసి అన్ని సార్లు చెప్పకూ....విసుగొస్తోంది అని నువ్వంటుంటావు....కానీ నీకో విషయం గుర్తు చేస్తున్నాను....
నీ చిన్నప్పుడు నీకు నిద్ర పట్టే వరకూ చెప్పిన కథనే ఎన్నిసార్లు చెప్పించుకున్నావో తెలుసా...మరొక్కసారి చెప్పమ్మా అంటూ పదే పదే చెప్పమ్మా అని నువ్వన్నప్పుడు నేనొక్కసారీ విసుగనుకోక చెప్తుండేదాన్ని ఒకే కథను మళ్ళీ మళ్ళీ....
అలాటిదే ఇదీనూ....
నాకిప్పుడు స్నానం చేయించుకోవడం ఇష్టం లేదని నన్ను పిచ్చిదానిలా కొట్టకు అని నువ్వనడం గుర్తుందా... 
నువ్వు చిన్నప్పుడు స్నానం చేయిస్తా రారా అంటే నువ్వు రాకుండా పరిగెట్టేదానివి. నేను నీ వెంటపడి పట్టుకుని స్నానం చేయించడానికి తీసుకుపోయేదాన్ని...
ఈరోజుల్లో ఆధునిక సాంకేతికత అన్నింట్లోనూ వచ్చేసింది. అవేవీ అర్థం కాని నేననేగా నన్ను చూస్తున్నావు. వాటినల్లా నేర్చుకుంటాను....కాస్త టైమివ్వు ... కానీ నువ్వు అణువంత టైమివ్వక నాకేదీ తెలీదన్నట్లు చూస్తుంటావు....
ఇదిగో నీకో విషయం గుర్తు చేస్తున్నా....
పద్ధతిగా ఎలా తినాలో, అందంగా బట్టలు వేసుకోవడం, తల దువ్వడం, ఇలా ఎన్ని విషయాలు రోజూ ఎంతో ఓపిగ్గా నేర్పించానో తెలుసా....
ఈరోజు నువ్వు నన్ను చూస్తున్నప్పుడు నీకు నేను ఓ ముసలిదానిలా కన్పిస్తున్నా కదూ...కాస్తంత సహనం పాటించు. అంతకన్నా ముఖ్యం....నా ఈ ముసలి వయసులో నన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అదే నా విజ్ఞప్తి. ఆశకూడా.
మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఓ విషయాన్ని సగంలో విడిచిపెట్టి మరేదో విషయంలోకెళ్ళిపోతాను. కాస్సేపటికి మళ్ళీ పాత విషయంలోకొస్తుంటాను. నీకది నచ్చదు....ఏం చేయను చెప్పు. అది వయస్సు ప్రభావం. జ్ఞాపకశక్తి క్రమేపీ తగ్గిపోతోంది. కోప్పడకు. 
నీకో విషయం తెలుసు. బాగా తెలుసు. నీ హృదయానికి తెలుసు. అదేంటో తెలుసా....నేను నీతో నీలో ఉండటం....అదిప్పుడు నాకెంతో ముఖ్యం.
నాకిప్పుడు వయస్సయిపోయుండొచ్చు. ఈ కారణంగానే నా కాళ్ళల్లో పటుత్వం తగ్గిపోయింది. నీకు పోటీగా నేను నడవలేను. ఏం చేయను.....వయస్సవుతే అంతే....ఒక్కొక్క అవయవ బలమూ తగ్గుతూ వస్తుంది. అది అడ్డుకోలేం. తప్పదు. దాని ప్రభావం అనుభవించాల్సిందే. చూపు మందగిస్తుంది. పళ్ళూడిపోయి గట్టివి తినలేం. కూర్చుంటే లేవలేం. లేస్తే కూర్చోలేం. మాట తడబడుతుంది. నువ్వు మొదటిసారిగా నడవటం నేర్చుకుంటున్నప్పుడు నేను నీకు సాయపడేటట్లు నా చేతుల్ని ఎలా చాచానో అలానే ఇప్పుడు నువ్వు నీ చేతులు నాకందించవా....అంతేతప్ప వేగంగా నడవలేకపోతున్నానని విసుక్కోకు.
నువ్వు నాతో ఉండు. నేను నా జీవితాన్ని సంతోషంగా ముగించాలనుకుంటున్నాను. నువ్వు నాకు కానుకగా ఇచ్చిన సమయాన్నీ సంతోషాన్నీ నేనెప్పుడూ మరచిపోను. నీకందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను.
నిండు మనసుతో చెప్తున్నా
వికసించిన నగుమోముతో మరొక్కసారి ఈ మాట చెప్పాలనుంది. చెప్తున్నాను....
నువ్వంటే పిచ్చిప్రేమే నాకు....
ఇట్లు 
నీ మనసైన అమ్మ