సాధు జంతువుల ఆరోగ్య రహస్యం (బుజ్జిపిల్లలకు బుజ్జి కథ): -౼ దార్ల బుజ్జిబాబు

 అది ఒక అడవి. అందులో కోతి, కుందేలు, ఉడుత ఉండేవి. అవి మంచి స్నేహితులు. అవి కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కుశాలుగా ఉండేవి .
           ఒక రోజు అవి అటూ ఇటూ గెంతుతూ  ఆడుకుంటున్నాయి.  ఎంతో  ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్న వీటిని అటుగా వెళుతున్న సింహం, నక్క, తోడేలు చూశాయి. సింహం ఆ అడవికి రాజు. నక్క,తోడేలు దాని మంత్రులు. 
       మహా మంత్రులారా! నేను ఈ ఆడవికి రాజును. నాకు ఏ సమస్యలు లేవు. శత్రు భయం అసలు లేదు. అయినా వాటిలా సంతోషంగా ఉండలేక పోతున్నాను. కారణం ఏమిటి?" అడిగింది సింహం.
          "నిజమే ప్రభూ! నేనూ మీ సుముఖంలో సుఖంగా ఉంటున్నాను . మీరు తిని మిగిల్చిన మాంసం కడుపారా తింటున్నాను. అయినా వాటిలా బలంగా, దృడంగా ఉండలేక పోతున్నాను. ఎంత తిన్నా నిరసమే. ఎలా బక్కచిక్కి డొక్కలు లాక్కు పోయాయో చూడండి" అంది నక్క.
             “అవును అమాత్యా! అవి  అందంగా నిగనిగలాడుతూ, ఆరోగ్యంగా ఉన్నాయో చూడండి . నేను మీ కొలువులో  చీకూచింతా లేకుండా ఉంటున్నాను. అయినా వాటిలా తాజాగా సంతోషంగా ఉండలేక పోతున్నాను. ఎప్పుడు ఏదో ఒక దిగులు. మానసిక వేదన" అంది తోడేలు.
         వాటి ఆరోగ్య రహస్యం తెలుసు కోవాలి అనుకుంది సింహం.  వాటిని అంతఃపురానికి పిలిపించింది. విషయం అడిగింది.
         “రాజా! మేము ఎవరికి ఏడు చేయము. అందుకే ఈ ఆనందం . ఆహార అన్వేషణలో తోటి ప్రాణిని హింసించి పాపాన్ని మూటకట్టుకోము. అందువల్ల పాప భీతి లేదు. అదే మా ఉల్లాసానికి కారణం " అంది కోతి.
            “మృగరాజా! మా ఆహారపు అలవాట్లు మీకు తెలియనివి కావు. మేము జగమెరిగిన శాకాహారులం. గడ్డీ, పండ్లు, దుంపలు మా ఆహారం, వాటి రసంలోనే ఉంది ఆరోగ్య రహస్యం.  మాంసంలో ఏముంది మంపు తప్ప"  అంది కుందేలు.
         ఇక ఉడుత చెంగునా దూకి "పరోపకారమే పరాయణం . మేము పరులకు ఎల్లవేళలా సాయపడుతూ ఉంటాము. స్వ ప్రయోజనం ఆశించము . రామాయణ కాలంలో కోతులు యుద్ధం చేశాయి.  మేము వారధి నిర్మించటంలో ఇసుక రేణువులు మోసాము.  ఆ సంగతి  అందరికి తెలుసు.  మాకు స్వర్గ ప్రాప్తి ఖాయం. అందుకే మాకు ఈ ఆనందం. సంతోషం" అంది.
        సింహం, నక్క, తోడేలు ఆలోచనలో పడ్డాయి.
           నీతి: ఆరోగ్యానికి శాకాహారమే మేలు