దేవుడికొచ్చిన కష్టం!: -- యామిజాల జగదీశ్
 ప్రపంచాన్ని సృష్టించిన వెంటనే దేవుడు మనిషినీ సృష్టించాడు.
మనిషిని సృష్టించిన కొంత కాలానికే అతనిని ఎందుకు సృష్టించేనా అని ఆలోచనలో పడ్డాడు. 
ఎందుకంటే, మనుషులు వేళాపాళా లేకుండా  కోరికలతో కోరుతూ దేవుడికి అర్జీ పెడుతూ తోచుకోనివ్వకపోవడమే.  
దేవుడికి మనిషికి కనిపించక ఎక్కడో అక్కడ దాక్కోవాలనుకున్నాడు. అందుకోసం తన అనుయాయులతో ఓ సమావేశం ఏర్పాటు చేసాడు. 
దేవుడు తన మనసులోని మాటను అనుయాయుల ముందుంచాడు. ముఖ్యంగా మనిషికి కనిపించక అదృశ్యమైపోవాలి. ఇందుకు ఏదైనా దారి చెప్పమన్నాడు.
సరేనని అనుయాయులు చర్చించుకుని హిమాలయపర్వతానికి వెళ్ళి దాక్కోమని దేవుడికి సూచించారు.
అయితే దేవుడు "ఎవరెస్టు శిఖరాన్ని ఎందరెందరో అధిరోహించారు. అక్కడికి ఎవరో ఒకరు చేరుకుని విజయోత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు. కనుక నేనక్కడ దాక్కుంటే లాభం లేదు. మరేదైనా ప్రాంతముంటే చెప్పండి" అన్నాడు.
"అలాగైతే పసిఫిక్ మహా సముద్రం అడుగులోకి వెళ్ళి దాక్కోవచ్చుగా" అన్నారు కొందరు.
"పసిఫిక్ మహాసముద్ర లోతునీ మనుషులు కొలిచి అధ్యయనాలు చేస్తున్నారు. కనుక అక్కడికి మనుషులు రారని గ్యారంటీ ఏమీ లేదు. మరొకటి చెప్పండి" అన్నాడు దేవుడు.
చంద్రమండలం, కుజగ్రహం, ఇలా ఏవేవో చెప్పుకుంటూ వచ్చారు అనుయాయులు. 
అవేవీ లాభం లేదన్నాడు దేవుడు.
అయితే అనుయాయులలో ఓ తెలివైనతను "మనిషి మనసులోకి ప్రవేశించి దాక్కోండి. మనిషి తెలుసుకోలేనిదీ అర్థం చేసుకోలేనిదీ వెతకలేని చోటంటూ  అదొక్కటే అనిపిస్తోంది" అన్నాడు.
దేవుడు "నిజమే. నువ్వు చెప్పింది బాగుంది. నేను మనిషి మనసులో దాక్కుంటాను. ఈ  విషయం మరెవరికీ తెలియనివ్వకండి"  అని అతనిని ప్రశంసించాడు.
మరుక్షణం దేవుడు మనిషి మనసులోకి ప్రవేశించాడు. అక్కడ స్థిరంగా ఉండి మనిషి నించి ఏ ఇబ్బందీ లేకుండా హాయిగా ఉన్నాడు.
మనసులోనే ఉన్న దేవుడి విషయం తెలియక మనిషి ఎక్కడెక్కడో వెతుకుతూనే ఉన్నాడు.