గొంగళిపురుగు ఓర్పు ( బుజ్జిపిల్లలకు బుజ్జికథ )౼ దార్ల బుజ్జిబాబు

 ఒక వనం ఉంది. అందులో ఒక గొంగళి పురుగు ఉంది. అది వాళ్లంత నూగుతో అసహ్యంగా ఉండేది. దాన్ని ముట్టుకుంటే చాలు, వళ్ళు గగుర్పొడిచేది. అందువల్ల తోటి కీటకాలు ఈసడించుకుంటూ ఉన్నాయి. కొన్ని దూరంగా పారిపోతూ ఉన్నాయి. అప్యాయంగా పిలిచేవారే కరువయ్యారు. స్నేహం చేయటానికి ఎవరూ రావటం లేదు .
     ఒక రోజు గొంగళి పురుగు దీనంగా వెళుతుంది . అప్పుడు ఒక ఈగ కలిసింది . ఇలా అంది. "మిత్రమా ! ఎందుకు అలా దు:ఖంగా ఉన్నావు?"
       " ఏమి చెప్పను ఈగ మిత్రమా ! నన్ను అందరూ శతృవుగా చూస్తున్నారు . ఏ పాపం చేసేనో ఏమో? చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. ఎదురుగానే పక పకా నవ్వుతూ ఉన్నారు. నాది ఒక  జన్మేనా? పాడు పుటుక పుట్టాను.  బతకడం దండగా, చావటం మేలు అనిపిస్తుంది."  అంది గొంగళి పురుగు .
   "అయ్యయ్యో! అంత మాట అనకు మిత్రమా! నీవు దిగులు పడకు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సవ్విన నాపచేనే పండుతుంది . ఓర్పుగా ఎదురు చూడు. న్యూనతతో ముడుచుకు పోకూడదు. శరీరాన్ని పవిత్రంగా చూసుకోవాలి.
ఇది దేవుని సృష్టి , ఎదో ఒక కారణం అని. అలా సృష్టించడు . ఏనాటికైనా మంచి రోజులు వస్తాయి " అని ఓదార్చింది ఈగ.
      గొంగళి పురుగు ఓపికగా రోజులు గడిపింది. ఎవరికి కనిపించకుండా ముసుగు కప్పుకుని ఉంది. కొన్నాళ్ళు గడిచాయి. దాని రూపం క్రమంగా మారింది. రంగురంగుల రెక్కలు వచ్చాయి. ముచ్చటైన ఆకారం ఏర్పడింది. ముద్దు ముద్దుగా తయారైంది. అందమైన సీతాకోక చిలుక అయింది.  దాని అందం చూడటానికి కీటకాలన్ని ఎగబడ్డాయి. నవ్వి చీదరించుకున్నవే  స్నేహం చేయడానికి తహతహలాడాయి. దానితో మాట్లాడటానికి ఉవ్విళ్లూరాయి. అది ఎగురుతుంటే ఆ వనం నందన వనం అయింది .
        నీతి: కష్టాలు కలిగి నపుడు సహనంగా, ఓర్పుగా ఉండాలి.